రష్మికను అందుకే కట్ చేశారు…

సరిలేరు టీజర్ వచ్చేసింది. టీజర్ సూపర్ హిట్ అయింది. చాన్నాళ్ల తర్వాత ఔట్ అండ్ ఔట్ మాస్ లుక్ లో మహేష్ ను చూస్తున్నారు జనం. ఓవైపు మిలట్రీ గెటప్ తో పాటు మరోవైపు రొటీన్ పాత్రలో కూడా మాస్ ఎలిమెంట్స్ చూపించారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

అన్నింటికంటే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. టీజర్ అంటే అది మహేష్ కే పరిమితం అవుతుందని అంతా ఊహించారు. కానీ సరిలేరు నీకెవ్వరు టీజర్ లో మహేష్ తో పాటు సినిమాలో కీలకపాత్రలు పోషించిన నటీనటులందర్నీ చూపించారు. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, అజయ్… ఇలా చాలా పాత్రలు కనిపించాయి. కానీ ఒక్కటే లోటు. అదే హీరోయిన్.

అవును.. సరిలేరు నీకెవ్వరు టీజర్ లో రష్మిక మిస్ అయింది. ఈ సినిమాలో ఆమెకు కీలక పాత్ర దక్కలేదని, అందుకే టీజర్ నుంచే ఆమెను కట్ చేయడం స్టార్ట్ చేశారని కొందరు వాదించారు. మరికొందరు సాంగ్స్ విడుదల చేసే కార్యక్రమం నుంచి రష్మిక లుక్ ను బయటపెడతారని ఫీలర్లు వదిలారు. వీటన్నింటికీ దర్శకుడు అనీల్ రావిపూడి సమాధానం ఇచ్చాడు

సరిలేరు నీకెవ్వరు టీజర్ నుంచి కావాలనే రష్మికను కట్ చేసినట్టు ప్రకటించాడు దర్శకుడు. ప్రచారంలో బాగంగా రష్మిక-మహేష్ కాంబోలో కొన్ని సీన్స్, సాంగ్స్ ను దాచిపెట్టామని.. త్వరలోనే ఆ క్లిప్స్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని చెబుతున్నాడు. చూస్తుంటే.. రష్మికకు ఈసారి స్పెషల్ ట్రీట్ మెంట్ దక్కేలా ఉంది.