ఇది ప్రేమికుల రోజు స్పెషల్

అందరి దృష్టి సంక్రాంతి సినిమాలపైనే ఉంది. అయితే సేమ్ టైమ్ సంక్రాంతి తో పాటు ఫిబ్రవరికి కూడా కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈసారి చాలా తెలుగు సినిమాలు వాలంటైన్స్ డే చుట్టూ తిరగబోతున్నాయి.

వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 7న 96 రీమేక్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా పక్కా ప్రేమకథ. దీనికి ఫిబ్రవరి నెలైతేనే కరెక్ట్ అని భావిస్తున్నాడు.

మరోవైపు నితిన్, విజయ్ దేవరకొండ కూడా ప్రేమికుల రోజుపై కన్నేశారు. విజయ్ దేవరకొండ నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేయాలని నిర్ణయించారు. అటు నితిన్ నటిస్తున్న భీష్మ సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేయాలని అనుకుంటున్నారు.

సాధారణంగా ఫిబ్రవరిలో బాక్సాఫీస్ సందడి తక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం చాలామంది హీరోలు ఫిబ్రవరిపై కన్నేశారు. మరీ ముఖ్యంగా యంగ్ హీరోస్ ఫోకస్ అంతా ఫిబ్రవరిపైనే ఉంది మరి. అటు నాగచైతన్య కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న సినిమాను ఫిబ్రవరికి రెడీ చేస్తే, పోటీ మరింత తీవ్రం కావొచ్చు.