నా సినిమా ఆ తండ్రికొడుక్కి అంకితం

కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాతో మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తనకు కేసులు కొత్తకాదని, ఈ సినిమాపై కూడా చాలా కోర్టు కేసులున్నప్పటికీ మూవీ రిలీజ్ అయి తీరుతుందని అంటున్నాడు. మరీ ముఖ్యంగా సినిమాలో కేఏ పాల్ కామెడీ అదుర్స్ అంటున్నాడు.

“మే 2019 నుండి జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కింది. కథ సెప్టెంబర్ 2020 టైమ్ వరకు నడుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన కథ ఆధారంగా దాని ఫ్యూచర్ ఊహించి తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి ప్రత్యేకంగా కామెడీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. కేఏ పాల్ లాంటి వ్యక్తి ఇన్సిడెంట్స్ స్క్రీన్ పైకి వచ్చినప్పుడు సహజంగానే కామెడీ వచ్చేస్తుంది. కాకపోతే దాన్నే ఈ సినిమాలో కాస్త సెటైరికల్ గా ప్రెజెంట్ చేశాం.”

ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బాగా పాపులర్ అయిన తండ్రికొడుకులకు అంకితమిస్తున్నట్టు ప్రకటించాడు వర్మ. వాళ్లు చంద్రబాబు, లోకేష్ కారని.. ప్రజలకు అలా అర్థమైతే అది తన తప్పుకాదని అంటున్నాడు.

“రియల్ ఇన్సిడెంట్స్.. రియల్ క్యారెక్టర్స్ తో సినిమా కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ పోలికలతో ఉన్నవాళ్ళే కావాలి. అందుకే గత ముఖ్యమంత్రి క్యారెక్టర్ లో నటించిన వ్యక్తిని నాసిక్ నుండి పిలిపించాం. ఓ నెల రోజుల పాటు ఇక్కడే ఉంచి నటనలో శిక్షణ కూడా ఇచ్చాం. ఈ సినిమాని తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పాపులర్ అయిన తండ్రీకొడుకులకు అంకితమిస్తున్నా.. వాళ్ళెవరు..? వాళ్ళ పేర్లు ఏంటనేది మాత్రం నేను చెప్పను”

ఈ సందర్భంగా ట్రయిలర్ లో పప్పు సీన్ గురించి మరోసారి మాట్లాడాడు వర్మ. ఆ పప్పు సీన్ తెలుగుదేశం పార్టీ వాళ్లకు చాలా నచ్చిందని, చాలామంది టీడీపీ నేతలు తనకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పుకొచ్చాడు వర్మ.