సగం డబ్బుకే సినిమా చేసిన నిఖిల్

అర్జున్ సురవరం సినిమాను సగం పారితోషికానికే చేశానంటున్నాడు నిఖిల్. సినిమా కథ నచ్చడంతో పాటు, నిర్మాత కష్టాల్లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. ఇప్పటివరకు కెరీర్ లో ఎప్పుడూ ఇలా చేయలేదని, అర్జున్ సురవరం సినిమాకు మాత్రం సగం డబ్బులకే పనిచేశానంటున్నాడు.

“ఈ సినిమాకు ఎంత చేయాలో అంతా చేశాను. ఇంకా చెప్పాలంటే నా రెమ్యూనరేషన్ కూడా అడగడం మానేశాను. నిర్మాత ఎంతిస్తే అంత తీసుకున్నాను. దాదాపు నా సగం పారితోషికం నేను తీసుకోలేదు. ఎందుకంటే నా ప్రొడ్యూసర్ ముందు సేఫ్ గా ఉండాలి.”

నిఖిల్ చేసిన కిరాక్ పార్టీకి, రేపు రిలీజ్ అవుతున్న అర్జున్ సురవరం సినిమాకు చాలా గ్యాప్ ఉంది. ఇకపై ఇలాంటి గ్యాప్స్ లేకుండా జాగ్రత్త పడతానంటున్నాడు నిఖిల్. మరీ ముఖ్యంగా వచ్చే ఏడాది కచ్చితంగా తన నుంచి 2 సినిమాలు వస్తాయంటున్నాడు.

“నెక్ట్స్ కార్తికేయ-2 చేయబోతున్నాను. గీతాఆర్ట్స్-2లో వీఐ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాను. వీటితో పాటు హనుమాన్ అనే మరో మూవీ చేయబోతున్నాను. ఈ సినిమాలన్నీ కొత్త కొత్త పాయింట్స్ తో వస్తున్నాయి. ప్రేక్షకులకే కాదు, నాక్కూడా చాలా కొత్త. మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ సినిమా రోబోటిక్స్ కాన్సెప్ట్ తో వస్తోంది.”

ప్రస్తుతం కార్తికేయ-2 సినిమాకు కాల్షీట్లు కేటాయించిన నిఖిల్.. వీఐ ఆనంద్ సినిమా లేదా హనుమంతు సినిమాల్లో ఏది ముందు ప్రీ-ప్రొడక్షన్స్ పూర్తిచేసుకుంటే, ఆ సినిమాకు కాల్షీట్లు ఇవ్వబోతున్నాడు.