ఆర్టీసీ స‌మ్మెకు కేసీఆర్ మార్క్ ఎండ్… సోమ‌వారం నుంచి చార్జీలు పెంపు !

ఆర్టీసీ స‌మ్మెకు పుల్ స్టాప్ ప‌డింది… కేసీఆర్ మార్క్ ఎండ్ ఇచ్చారు. 52 రోజుల స‌మ్మె విర‌మ‌ణ త‌ర్వాత శుక్ర‌వారం ఉద‌యం ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేర‌బోతున్నారు. ప‌నిలో ప‌నిగా సోమవారం నుంచి చార్జీలు పెంచుతున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. కిలోమీట‌ర్ కు 20 పైస‌లు పెంచారు. చార్జీల పెంపును ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాల‌ని కోరారు. ఎలాంటి ష‌ర‌తులు లేకుండా కార్మికుల‌ను ఉద్యోగాల్లో చేరేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు కేసీఆర్ చెప్పారు.

ఆర్టీసీని కాపాడుకుందామని…. వంద‌కోట్లు మంజూరు చేస్తున్న‌ట్లు అర‌గంట ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ఆర్టీసీలో సంస్క‌ర‌ణ‌లు తెస్తే… ప్రైవేటు ప‌రం చేస్తే… కార్మికులకు లాభం తెచ్చేలా ఉంటాయ‌ని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల‌కే ప్రైవేటు బ‌స్ ప‌ర్మిట్లు ఇస్తామ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే కొంత‌మంది కార్మికుల‌ను పిలిచి మాట్లాడుతానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఆర్టీసీ స‌మ‌గ్ర ఆర్ధిక ప‌రిస్థితిని తెలుగులో ప్ర‌చురించి 49 వేల మంది కార్మికులకు పంచుతామ‌ని వివ‌రించారు. చ‌నిపోయిన కార్మికుల కుటుంబాల‌కు ఉద్యోగమిస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఆర్టీసీ కార్మికులు త‌మ బిడ్డ‌లే అని… వాళ్లు తిట్టినా… నిందించినా ప‌ట్టించుకోబోమ‌ని కేసీఆర్ అన్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉంటే సింగ‌రేణిలా ఆర్టీసీని తీర్చిదిద్దుతామ‌ని చెప్పారు. యూనియ‌న్ల స్థానంలో ప్ర‌తి డిపోలో ఇద్ద‌రు కార్మికుల‌తో వెల్ఫేర్ క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు.