అలాగైతే అది కుంభకోణమేగా బాబు?

తాను ఎంపిక చేసిన ప్రాంతం రాజధానికి అన్ని విధాలుగా మంచిది అని నమ్మించేందుకు చంద్రబాబు కొత్తకొత్త విషయాలు చెబుతున్నారు. ముందు అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు భారీ వ్యయం అవుతుండడాన్ని…. నిన్న చంద్రబాబు సమర్ధించుకున్న తీరు కూడా ఆశ్చర్యంగానే ఉంది.

పునాది వేయాలంటే హైదరాబాద్‌లో రాళ్లను తొలగించాల్సి ఉంటుంది… ఆ ఖర్చుతో పోలిస్తే అమరావతిలో పునాదుల నిర్మాణానికి తక్కువ వ్యయం అవుతుందని చంద్రబాబు చెప్పారు. నిజానికి రాతినేల పునాదులకు గట్టిగా ఉంటుంది.

హైదరాబాద్‌లో రాయి తొలగించడానికి అత్యధిక ఖర్చు అవుతుందని చెబుతున్న చంద్రబాబు… మరి హైదరాబాద్‌లో చదరపు అడుగు నిర్మాణానికి మూడు వేలు మాత్రమే అవుతుంటే… భూమి, ఇసుక అన్ని ఉచితంగా ఇచ్చిన తర్వాత కూడా అమరావతిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు నిర్మాణం చేయడానికి చదరపు అడుగుకు ఏకంగా 10వేలు ఎందుకు ఖర్చు చేశారో చెప్పి ఉండాల్సింది.

చంద్రబాబు ఎంపిక చేసిన భూమి నిర్మాణాలకు సరైనదే అయితే సచివాలయానికి వంద అడుగుల లోతుకు పునాదులు ఎందుకు తవ్వాల్సి వచ్చిందో కూడా వివరించాల్సింది.

చంద్రబాబు చెబుతున్న దాని ప్రకారం నిర్మాణ విషయంలో చదరపు అడుగుకు 10వేలు చెల్లించడం వెనుక కుంభకోణం అయినా జరిగి ఉండాలి… లేదంటే… రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతం అయినా సరైనది కాదని చెప్పాల్సి ఉంటుంది.