Telugu Global
NEWS

ప్రారంభసింగిల్స్ లో భారత్ జోరు

పాక్ పై భారత్ 2-0 ఆధిక్యం డేవిస్ కప్ ప్రారంభసింగిల్స్ లో భారత్ తిరుగులేని విజయాలతో 2-0తో పైచేయి సాధించింది. కజకిస్థాన్ రాజధాని నూర్ సుల్తాన్ వేదికగా జరుగుతున్న ఆసియా-ఓషియానా జోన్ డేవిస్ కప్ పోటీల తొలిరోజున భారత్ కు ఎదురేలేకపోయింది. తటస్థవేదికలో తొలిసారిగా తలపడుతున్న భారత-పాక్ జట్లు ద్వితీయశ్రేణిజట్లతోనే పోటీకి దిగాయి. సింగిల్స్ తొలిమ్యాచ్ లో భారత ఆటగాడు రామ్ కుమార్ రామనాథన్ 6-0, 6-0తో పాక్ టీనేజర్ మహ్మద్ షోయబ్ ను చిత్తు చేశాడు. తొలి […]

ప్రారంభసింగిల్స్ లో భారత్ జోరు
X
  • పాక్ పై భారత్ 2-0 ఆధిక్యం

డేవిస్ కప్ ప్రారంభసింగిల్స్ లో భారత్ తిరుగులేని విజయాలతో 2-0తో పైచేయి సాధించింది. కజకిస్థాన్ రాజధాని నూర్ సుల్తాన్ వేదికగా జరుగుతున్న ఆసియా-ఓషియానా జోన్ డేవిస్ కప్ పోటీల తొలిరోజున భారత్ కు ఎదురేలేకపోయింది.
తటస్థవేదికలో తొలిసారిగా తలపడుతున్న భారత-పాక్ జట్లు ద్వితీయశ్రేణిజట్లతోనే పోటీకి దిగాయి. సింగిల్స్ తొలిమ్యాచ్ లో భారత ఆటగాడు రామ్ కుమార్ రామనాథన్ 6-0, 6-0తో పాక్ టీనేజర్ మహ్మద్ షోయబ్ ను చిత్తు చేశాడు. తొలి సింగిల్స్ మ్యాచ్ కేవలం 42 నిముషాలలోనే ముగిసిపోయింది.

ఆ తర్వాత జరిగిన రెండో సింగిల్స్ లో భారత రెండోర్యాంక్ ఆటగాడు సుమిత్ నగాల్ 6-0, 6-2తో పాక్ టాప్ ర్యాంక్ ప్లేయర్ హుజీఫా అబ్దుల్ రెహ్మాన్ ను చిత్తు చేసి భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఈ పోటీ 64 నిముషాలపాటు సాగింది.

పాక్ జట్టుకు సీనియర్ ప్లేయర్లు ఖురేషీ, అఖిల్ ఖాన్ దూరం కావడంతో..ఇద్దరు టీనేజ్ ప్లేయర్లతోనే పోటీకి దిగాల్సి వచ్చింది. పోటీల రెండోరోజున జరిగే డబుల్స్ లో భారతజోడీ లియాండర్ పేస్- జీవన్ నెడుంజెళియన్ నెగ్గితే ..3-0తో విజయం పూర్తవుతుంది.

ప్రపంచ రికార్డుకు పేస్ రెడీ..

డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక విజయాల రికార్డుకు భారత వెటరన్ స్టార్ లియాండర్ పేస్ తహతహలాడుతున్నాడు. పాక్ తో జరిగే డబుల్స్ మ్యాచ్ లో నెగ్గడం ద్వారా 44 విజయాలు సాధించిన ఏకైక ప్లేయర్ గా రికార్డుల్లో చేరనున్నాడు.

జీవన్ జంటగా డేవిస్ కప్ డబుల్స్ మ్యాచ్ లో పాక్ యువజంటతో పేస్ తలపడనున్నాడు.

పాక్ పై డేవిస్ కప్ లో ఇప్పటి వరకూ ఆరుసార్లు తలపడిన భారత్ 6-0 విజయాల రికార్డుతో ఉంది. పాక్ ప్రత్యర్థిగా ఏడోసారి నెగ్గడం ద్వారా…మార్చి 6, 7 తేదీలలో జరిగే ప్రపంచ గ్రూపు సమరంలో క్రొయేషియాతో తలపడనుంది.

First Published:  29 Nov 2019 8:34 PM GMT
Next Story