కమ్మరాజ్యంలో అప్ డేట్ ఇదే

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది. కొద్దిసేపటి కిందట సెన్సార్ అధికారులు ఈ సినిమాను సమగ్రంగా చూశారు. కాకపోతే వాళ్లు వెంటనే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించారు. రివ్యూ కమిటీ కూడా పరిశీలించిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తామని ప్రకటించారు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయాల్ని స్వయంగా వెల్లడించాడు. రివ్యూ కమిటీ ఈ సినిమాను ఎప్పుడు చూస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే రివ్యూ కమిటీకి పెద్దగా టైమ్ లేదు. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు 4వ తేదీ లోపు ఈ సినిమాకు ఎట్టిపరిస్థితుల్లో సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేయాలి.

రివ్యూ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అప్పుడు తదుపరి చర్యలు చేపడతామని వర్మ ప్రకటించాడు. ఈ సినిమాకు టైటిల్ మారుస్తామని ఇప్పటికే వర్మ ప్రకటించాడు. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక రివ్యూ కమిటీ ఎన్ని కట్స్ చెబుతుందనేది వేచిచూడాలి. ఆ తర్వాత విడుదల తేదీపై ఓ క్లారిటీ వస్తుంది.