బీజేపీలో చేరిన నమిత

ఒకప్పటి హీరోయిన్ నమిత పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయింది. తాజాగా ఆమె భారతీయ జనతా పార్టీలో చేరింది. చెన్నైలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంది నమిత. నిజానికి నమిత ఈ పని చేస్తుందని ఎప్పుడో భావించారు. ఎందుకంటే.. గత ఎన్నికల టైమ్ లోనే నాది, మోడీది ఒకటే రాష్ట్రం, మా ఇద్దరిదీ ఒకటే భావజాలం అంటూ తెగ పొగిడేసింది. ఆ టైమ్ లోనే ఆమె బీజేపీలోకి వెళ్తుందని అంతా అనుకున్నారు.

కానీ మొన్నటివరకు ఆమె అన్నాడీఎంకేలో ఉంది. తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వ్యూహాత్మకంగా ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. మొన్నటివరకు ఆమె కమల్ స్థాపించిన పార్టీ లేదా రజనీకాంత్ కొత్త పార్టీలో చేరతారంటూ కథనాలు వచ్చాయి. ఇప్పటికీ తమిళ మీడియా అవే తరహా వార్తలు ఇస్తోంది. అంతలోనే నమిత సెడన్ గా బీజేపీలోకి జంప్ కొట్టింది.

తెలుగులో సింహా సినిమా తర్వాత మళ్లీ పెద్దగా కనిపించలేదు నమిత. ఆ తర్వాత 2-3 చిన్న సినిమాలు, డబ్బింగ్ మూవీస్ చేసింది. రెండేళ్ల కిందట ఓ తెలుగు చిన్న నిర్మాతను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు పూర్తిగా రాజకీయాలపై ఆమె దృష్టిపెట్టింది.