నాని సరసన ఊహించని హీరోయిన్

నాని.. ఈ హీరోకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్, పరిచయాలు, ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. తన సినిమాల కోసం కావాలనుకుంటే ఎంత పెద్ద హీరోయిన్ ను అయినా రప్పించుకోగలడు ఈ హీరో. అటు హీరోయిన్స్ కూడా నాని అడిగితే కాల్షీట్లు ఇవ్వడానికి రెడీ. అయితే ఎవ్వరూ ఊహించని హీరోయిన్ కు అవకాశం ఇచ్చాడు ఈ నేచురల్ స్టార్. అంతగా లైమ్ లైట్లో లేని రీతు వర్మకు తన కొత్త సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు.

దర్శకుడు శివనిర్వాణతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాడు నాని. వీళ్లిద్దరి మధ్య తాజాగా కథాచర్చలు పూర్తయ్యాయి. సినిమా కూడా లాక్ అయింది. ప్రస్తుతం చేస్తున్న V సినిమా కంప్లీట్ అయిన వెంటనే శివనిర్వాణ సినిమా ఉంటుంది. ఇందులో హీరోయిన్ గా రీతూ వర్మను తీసుకున్నారు.

పెళ్లిచూపులతో పేరుతెచ్చుకుంది రీతూవర్మ. అయితే ఆ సినిమా ఆమె కెరీర్ కు పెద్దగా కలిసిరాలేదు. ఆ తర్వాత వచ్చిన కేశవ సినిమా కూడా అంతంతమాత్రం. దీనితో ప్రస్తుతం తమిళ సినిమాలకే పరిమితమైపోయింది ఈ భామ. ఇలాంటి టైమ్ లో నాని సినిమాలో ఛాన్స్ అంటే అది ఆమె కెరీర్ కు ఊతమిచ్చే అంశమే.