Telugu Global
National

జగన్ పాలనపై తెలుగుదేశం పుస్తకం....

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు…. కనీసం ఒక్క హామీని కూడా పరిపూర్ణంగా నెరవేర్చలేక అసలు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోనే ప్రజలకు కనబడకుండా మాయం చేసిన చంద్రబాబు ఇప్పుడు…. ఇంకా ఆరు నెలలు గడవకుండానే ఎన్నికల హామీలను 80 శాతం నెరవేర్చిన జగన్ పాలనపై పుస్తకాలు ప్రచురించడం లాంటి తెంపరి తనం ఆయనకే చెల్లింది. ఏప్రభుత్వం అయినా ఎలా పనిచేస్తుందో అంచనా వేయడానికి కనీసం ఏడాది సమయం తీసుకుంటారు. కానీ అనేక అస్థవ్యస్థమైన…. […]

జగన్ పాలనపై తెలుగుదేశం పుస్తకం....
X

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు…. కనీసం ఒక్క హామీని కూడా పరిపూర్ణంగా నెరవేర్చలేక అసలు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోనే ప్రజలకు కనబడకుండా మాయం చేసిన చంద్రబాబు ఇప్పుడు…. ఇంకా ఆరు నెలలు గడవకుండానే ఎన్నికల హామీలను 80 శాతం నెరవేర్చిన జగన్ పాలనపై పుస్తకాలు ప్రచురించడం లాంటి తెంపరి తనం ఆయనకే చెల్లింది.

ఏప్రభుత్వం అయినా ఎలా పనిచేస్తుందో అంచనా వేయడానికి కనీసం ఏడాది సమయం తీసుకుంటారు. కానీ అనేక అస్థవ్యస్థమైన…. ఆర్థిక అరాచకత్వాన్ని వారసత్వంగా అందించిన చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇప్పుడే జగన్ ఆరునెలల పాలనను చూసి కలవరపాటుకు గురవుతోంది.

ఎంతగా ఆందోళన చెందుతుందో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. శనివారం నాడు జగన్ ఆరునెలల పాలనపై 24 పేజీలతో కూడిన పుస్తకాన్ని విడుదల చేసి, జగన్ ను దెబ్బతీశామని తెలుగుదేశం నేతలు సంబరపడుతున్నారు.

6 నెలల జగన్ అరాచక పాలన.. మంచి సీఎం కాదు.. జనాన్ని ముంచే సీఎం.. అనే శీర్షికతో ప్రత్యేకంగా పుస్తకాన్ని విడుదల చేశారు. ఇచ్చిన పథకాలకన్నా రద్దు చేసిన పథకాలే ఎక్కువ..మాటతప్పారు.. మడమ తిప్పారు..అభివృద్ది రివర్స్ ..అంటూ విరుచుకు పడ్డారు. మొత్తం పుస్తకాన్నితిరగేస్తే దాన్లో తెలుగుదేశం పార్టీ అక్కసు వెళ్లగక్కడానికి మినహా రాష్ర్ట అభివృద్దికి చేసిన సూచన ఒక్కటీ కన్పించదు.

చంద్రబాబు నాయుడు ఫోటోలు.. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన స్థలంలో చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేసే ఫొటోలను ముందు పెట్టి మరీ ఈపుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆరునెలల్లో చేసిన అభివృద్ది గురించి ఒక్కమాట కూడా చెప్పలేదు. ఆరుకోట్ల ప్రజానీకానికి చేస్తోన్న మంచి గురించి ఒక్క పేజీలోనూ ప్రస్తావించలేదు.

రద్దుల ప్రభుత్వం రివర్స్ పాలన…. అంటూ మొదటి అధ్యాయాన్ని ప్రారంభించారు. దీన్లో లేనిపోని కథనాలు, ఫొటోలు వేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎడాపెడా చేసిన ఖర్చులు, అయిన వారికి ఇష్టానుసారంగా ఇచ్చిన టెండర్లను రద్దు చేసి, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఆదాచేయడాన్ని అన్నివర్గాలూ హర్షిస్తుంటే…. తెలుగుదేశం నేతలు మాత్రం ఆక్రోశిస్తున్నారు.

పోలవరం, రాజధాని నిర్మాణం, పిపిఎలు వంటివాటిల్లో వైసిపి ప్రభుత్వం అనుసరించే వైఖరి రాష్ర్ట ఆర్థిక స్థితిని మెరుగు పరచుకోవడానికేగానీ, సొంత ప్రయోజనం కోసం కాదు. కానీ దీన్ని తప్పు బట్టే రీతిలో తెలుగుదేశం ప్రచురించిన పస్తకంలో పేర్కొన్నారు

పనికి వచ్చేవి పడగొట్టారు.. తండ్రివిగ్రహాలు పెట్టాడు… అంటూ మరో అధ్యాయం రాశారు. ప్రజావేదికను అక్రమంగా కట్టారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ప్రజావేదికను కూలగొట్టారు. రెండు మూడు కోట్లు కూడా చేయని నిర్మాణానికి 7కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారని, పైగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేయడం చట్టరీత్యా సరైంది కాదని భావించి ప్రజావేదికను కూల్చివేశారు. దీన్ని తప్పుబట్టడంలో టీడీపీ నైజం బయటపడింది.

విజయవాడలోని పోలీస్ కంట్రోలు రూం దగ్గర గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని చంద్రబాబు నాయుడు ఆగమేఘాల మీద కూల్చి వేశారు. రాత్రికి రాత్రి ఎంతమంది అడ్డుకున్నా, పోలీసుల్ని పెట్టి మరీ కూల్చివేశారు. ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరూ ఏమీ అనలేక పోయారు.

కానీ ఇపుడు జగన్ అధికారంలోకి వచ్చారు. రాష్ర్టానికి పాలనలో మార్గదర్శిగా నిలిచిన వైఎస్ఆర్ విగ్రహాన్ని పడగొట్టిన చోటే విగ్రహం పెట్టాలని ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదన. అందుకే మళ్లీ ఏర్పాటు చేశారు. ఆరోజు ఉన్నవిగ్రహాన్ని పడగొట్టి ఉండక పోతే ఈరోజు కొత్త విగ్రహం వచ్చేది కాదు కదా? దీన్ని అక్రమమని ఎందుకు అన్వయించారో అర్థం కాదు.

జగన్ మాట తప్పారు…మడమ తిప్పారు.. అంటూ మరో అధ్యాయంలో పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, మద్యనిషేధం వంటివి ఉన్నాయి. పాఠశాల పురోగతిపై నాడు..నేడు అని ప్రారంభించిన సంగతిని విస్మరించారు. అగ్రిగోల్డ్ బాధితులకు నిధులు విడుదల అంశాన్ని టీడీపీ మర్చిపోయింది. మద్యనిషేధం దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్న విషయాన్ని కూడా టీడీపీ గుర్తించలేదు. అడుగడుగునా ఉక్రోశమే తప్ప, ఉపయోగపడే సూచనలు ఎక్కడా లేవు.

పేదలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు…. అంటూ మరో అధ్యాయంలో పేర్కొన్నారు. ఇళ్ల సమస్య ,విద్యుత్ కోత, నిత్యవసరాల ధరలు వంటివాటిని పేర్కొన్నారు. 25లక్షల ఇళ్లను కట్టించి ఇవ్వడానికి సిద్దమైన అంశం ఎందుకు గుర్తించలేదో?… విద్యుత్ రంగంలో తీసుకొచ్చే సంస్కరణలపై నోరుమెదపలేదేంటి?… 2రూపాయలకు కొనాల్సిన విద్యుత్ ను 6 రూపాయలకు టీడీపీ హయాంలో కొన్న అంశాన్ని ఎందుకు పేర్కొనలేదు?

అవినీతికి గేట్లెత్తేశారు.. అని ఇంకో అధ్యాయం రాశారు. ఎక్కడ అవినీతి జరిగిందో, ఎవరు చేశారో స్పష్టంగా చెప్పిన దాఖలాలు లేవు. ఇసుకను దోచేస్తున్నారని, ఎర్రచందనాన్ని అమ్ముకుంటున్నారని, గ్రామవాలంటీర్ల పోస్టులు అమ్మేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇసుకలో దోపిడీ గురించి టీడీపీ నేతలు చెప్పడం విడ్డూరమే. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుకను టీడీపీ నాయకులు ఎలా దోచుకుందీ ఎవరిని అడిగినా చెపుతారు.

గ్రామ వాలంటీర్ల పోస్టుల నియామకం ఎంత పారదర్శకంగా సాగిందో అందరికీ తెలుసు. జన్మభూమి కమిటీలతో అరాచకాలు సృష్టించిన రోజుల్ని టీడీపీ మర్చిపోయినా… ప్రజలు ఇంకా మరిచిపోలేదు.

రైతుల్లో నిర్వేదం..నైరాశ్యంలో ఆత్మహత్యలు… అంటూ రైతులపై టీడీపీకి ఎంతో ప్రేమ ఉన్నట్లు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అది బెడిసి కొట్టింది. రైతు రుణమాఫీ పేరుతో నానా హడావిడి చేసిన చంద్రబాబు చివరికి రైతుల్ని మోసం చేశారే తప్ప వారికి ఒరగబెట్టింది ఏమీ లేదు.

ఎపుడూ లేనంత వర్షపాతం నమోదయింది ఇప్పుడు. మెట్టప్రాంతాలు సైతం పంటలతో కళ కళ లాడుతున్నాయి. రైతు భరోసా అందరికీ అందింది. దీనిని తట్టుకోలేని టీడీపీ, వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చడం మళ్లీ మొదలు పెట్టారు.

చిరుద్యోగులపై వేధింపులు..ఆత్మహత్యాయత్నాలు… అంటూ చిరుద్యోగుల్ని మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను సైతం అమ్ముకోవడం, ఒకే కులానికి కట్టబెట్టడం చేసిన టీడీపీ నేతలు ఇపుడు దీనికోసం ప్రత్యేకంగా కార్పోరేషన్ ఏర్పాటు చేసి, దానిలోనూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసే దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. సుమారు 4లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడాన్ని టీడీపీ తట్టుకోలేక పోతోంది. అందుకే ఆందోళనతో ఆపసోపాలు పడుతోంది.

మహిళలపై అత్యాచారాలు.. గ్రామాల్లో నిర్భందకాండ.. అంటూ మరో అధ్యయాన్ని పేర్కొంది. కానీ దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్నపుడు చింతమనేని ప్రభాకర్ చేసిన ఘనకార్యం ఏమిటో పేర్కొనలేదు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలపై ఉన్నత వర్గాలు చేసిన దౌర్జన్యాలు, అత్యాచారాల గురించి వివరించలేదు.

ఇపుడు స్పందన కార్యక్రమం ద్వారా చిన్న కాగితంపై ఫిర్యాదు చేస్తే ఏడు రోజుల్లోగా సమస్యను పరిష్కరించడం, స్పందించడం అధికారులకు ఆనవాయితీ అయింది. దీనిపై ముఖ్యమంత్రి వారం వారం సమీక్ష చేయడం కూడా అధికారుల్లో బాధ్యత పెరిగింది. కేవలం గణాంకాలకే పరిమితమైన చంద్రబాబు…. నిజమైన మంచి పాలన గురించి ఆలోచించలేకపోతున్నారు.

ఇలాంటివే అనేక అంశాలను తీసుకొని, వాటికి వక్ర భాష్యాలు చెబుతూ ప్రత్యేక పుస్తకాన్ని టీడీపీ ప్రచురించింది. అయితే దీన్లో అన్ని పేజీల్లోనూ అధికార పక్షాన్ని తూర్పార పట్టడానికే కేటాయించారు గానీ, రాష్ర్ట అభివృద్దికి నిర్మాణాత్మకమైన సూచనలూ, సలహాలు ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ ఆరునెలల పాలనలోనే ఇంత చేస్తే… నాలుగున్నరేళ్ల పాలనలో జగన్ ఇంకా ఏమి చేస్తాడో? అనే భయం టీడీపీకి పట్టుకున్నట్లు వారు విడుదల చేసిన పుస్తకంలో స్పష్టంగా కన్పిస్తోంది.

First Published:  1 Dec 2019 12:14 AM GMT
Next Story