ఫార్ములావన్ గ్రాండ్ విన్నర్ లూయి హామిల్టన్

  • అబుదాబీ గ్రాండ్ ప్రీ లోనూ తిరుగులేని హామిల్టన్

ఫార్ములావన్ 2019 సీజన్ ను టీమ్ మెర్సిడెస్ రేసర్ లూయి హామిల్టన్ విజయంతో ముగించాడు. అబుదాబీ వేదికగా ముగిసిన సీజన్ ఆఖరి రేస్ ను సైతం అలవోకగా నెగ్గి ఆరోసారి ప్రపంచ టైటిల్ అందుకొన్నాడు.

సీజన్లో 11వ విజయం

2019 ఫార్ములావన్ సీజన్ మొత్తం 21 రేస్ ల్లో లూయి హామిల్టన్ 11వ విజయం నమోదు చేశాడు. గంటకు 360 కిలోమీటర్ల వేగంతో సాగిపోయే ఫార్ములావన్ అబుదాబీ రేస్ ను పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించిన హామిల్టన్ ప్రారంభం నుంచి ముగింపు వరకూ మెరుపువేగంతో దూసుకుపోయాడు.

పోల్ పొజిషన్ తో పాటు అత్యంతవేగంగా ల్యాప్ టైమింగ్ సాధించిన హామిల్టన్ చివరకు రేస్ విన్నర్ గా సైతం నిలవడం ద్వారా ఫార్ములావన్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేయగలిగాడు.

అబుదాబీ విన్నర్ గా హామిల్టన్ రన్నరప్ గా సెబాస్టియన్ వెట్టల్, మూడోస్థానంలో అలెక్స్ అల్బోన్ నిలిచారు.

పోల్ నుంచి 50వ గెలుపు..

హామిల్టన్ పోల్ పొజిషన్ నుంచి 88వసారి టైటిల్ వేటకు దిగడం ద్వారా..50వ విజయం నమోదు చేశాడు. హామిల్టన్ కెరియర్ లో ఇది 84వ రేస్ విజయం కావడం మరో విశేషం. అత్యధిక విజయాలతో ఆరోసారి విశ్వవిజేతగా నిలిచిన లూయి హామిల్టన్ .. జర్మన్ ఆల్ టైమ్ గ్రేట్ మైకేల్ షుమాకర్ తర్వాతి స్థానంలో నిలిచాడు.

ఏడుసార్లు ఫార్ములావన్ విశ్వవిజేతగా నిలిచిన అరుదైన రికార్డు మైకేల్ షుమాకర్ పేరుతోనే ఉంది. ఇప్పడు హామిల్టన్ 6వ ప్రపంచ టైటిల్ తో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.