అనుష్క జనవరి సెంటిమెంట్

భాగమతి తర్వాత బొమ్మాలి కనిపించడం మానేసింది. అలా రెండేళ్ల పాటు వెండితెరకు దూరమైన ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి ముఖానికి రంగేసుకుంది. ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈరోజు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జనవరి 31న అనుష్క నిశ్శబ్దం రిలీజ్ అవుతుంది.

ఈ తేదీకి అనుష్క కెరీర్ కు ఓ చిన్న లింక్ ఉంది. సరిగ్గా రెండేళ్ల కిందట జనవరి నెలలోనే అనుష్క నటించిన భాగమతి సినిమా థియేటర్లలోకి వచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు జనవరిలోనే నిశ్శబ్దం వస్తోంది. అలా రెండేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క థియేటర్లలోకి వస్తోంది.

ఇప్పుడీ తేదీలకు సెంటిమెంట్ ముడిపెడుతున్నారు అనుష్క ఫ్యాన్స్. జనవరిలో వచ్చిన భాగమతి హిట్ అయింది కాబట్టి, ఈసారి జనవరికి వస్తున్న నిశ్శబ్దం కూడా తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ సెంటిమెంట్ డిస్కషన్ లో పడి, అసలు అనుష్క ఈ ఏడాది మొత్తాన్ని మిస్ అయిందనే విషయాన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.