జాతీయ టీ-20 విజేత కర్నాటక

  • ఫైనల్లో తమిళనాడుపై 1 పరుగు గెలుపు

జాతీయ టీ-20 చాంపియన్లకు ఇచ్చే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని కర్నాటక గెలుచుకొంది. సూరత్ లోని లాల్ బాయి కాంట్రాక్టర్ స్టేడియం వేదికగా ముగిసిన థ్రిల్లింగ్ టైటిల్ ఫైట్ లో కర్నాటక ఒక్క పరుగు తేడాతో తమిళనాడును అధిగమించి విజేతగా నిలిచింది.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన కర్నాటక 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగుల స్కోరు సాధించింది. కెప్టెన్ మనీష్ పాండే 2 సిక్సర్లు, 4 బౌండ్రీలతో 60 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

సమాధానంగా టైటిల్ నెగ్గాలంటే 181 పరుగులు చేయాల్సిన తమిళనాడు ఒక దశలో 10 ఓవర్లలో 4 వికెట్లకు 80 పరుగుల స్కోరుతో ఎదురీత మొదలు పెట్టింది.

మిడిలార్డర్ ఆటగాళ్లు బాబా అపరాజిత-విజయ్ శంకర్ కేవలం 7 ఓవర్లలోనే 71 పరుగులతో కీలక భాగస్వామ్యంతో విజయానికి చేరువగా తీసుకువెళ్లారు.

ఆఖరి 17 బాల్స్ లో 30 పరుగులు చేయాల్సిన తమిళనాడు తుది వరకూ పోరాడినా ఒక్క పరుగు తేడాతో పరాజయం చవిచూడక తప్పలేదు.

రవిచంద్రన్ అశ్విన్ ఆఖరి ఓవర్లో 2 బౌండ్రీలు సాధించినా..ఆఖరి రెండు బంతుల్లో 4 పరుగులు చేయలేకపోడంతో…తమిళనాడు రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుసగా 15 విజయాలతో జాతీయ రికార్డు నెలకొల్పిన కర్నాటక…జాతీయ వన్డే చాంపియన్లకు ఇచ్చే విజయ్ హజారే ట్రోఫీతో పాటు.. టీ-20 విన్నర్ కూడా కావడం విశేషం. రెండు ఫైనల్స్ లోనూ తమిళనాడుపైనే కర్నాటక విజేతగా నిలవడం మరో విశేషంగా మిగిలిపోతుంది.