మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయవద్దు – డీజీపీ

సోషల్ మీడియాలో ఆకతాయిల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రియాంక రెడ్డి ఉదంతం నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే తమను సంప్రదించాల్సిందిగా పోలీసు శాఖ పలు నెంబర్లను విస్త్రృతంగా ప్రచారం చేస్తోంది. దీన్ని అలుసుగా తీసుకుని కొందరు ఫేక్ నెంబర్లను కూడా ప్రచారంలోకి తెచ్చారు. మహిళలు ప్రయాణించే ఆటో, క్యాబ్ నెంబర్లను 9969 777 888 కు ఎస్‌ఎంఎస్‌ చేయండి అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన బాగా తిరుగుతోంది.

‘‘మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు మంచి సర్వీసు ప్రారంభించారు. మీరు ప్రయాణించే కారు, క్యాబ్‌ లేదా ఆటో నంబర్‌ను 9969 777 888కు ఎస్ఎంఎస్ చేయండి. మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. మీరు ప్రయాణించే వాహనం జీపీఆర్‌ఎస్‌కు అనుసంధానం అవుతుంది. మరికొంతమంది ఆడపడుచులకు ఈ సందేశాన్ని పంపండి’’ అంటూ ఈ సందేశం ప్రచారంలోకి వచ్చింది.

ఈనెంబర్‌కు… పోలీస్ శాఖకు… ఎలాంటి సంబంధం లేదు. 9969 777 888 నెంబర్ పోలీసులు ఇచ్చింది కాదు… ఎవరో పనిగట్టుకుని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఇదో ఫేక్ నెంబర్ అని దీనికి ఎలాంటి ఎస్‌ఎంఎస్ లు పంపవద్దని ఏపీ డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఈ నెంబర్‌ను ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ ప్రకటించారు.

మహిళలు, పిల్లలు, ప్రజలు ఎలాంటి ఆపదలో ఉన్నా 100, 112, 181 నెంబర్లకు కాల్ చేయాల్సిందిగా డీజీపీ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో మహిళల రక్షణ కోసం ‘సైబర్‌–మహిళామిత్ర’ వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేశామని… వాట్సాప్‌ నంబర్‌ 9121211100 అని డీజీపీ కార్యాలయం వివరించింది.

కొందరు తప్పుడు నెంబర్లను ప్రచారం చేస్తున్నారని వాటికి కాల్ చేయవద్దని… 100, 112, 181 నెంబర్లకు మాత్రమే కాల్ చేయాలని డీజీపీ కార్యాలయం కోరింది.

100కు ఫోన్‌ చేస్తే కాల్‌ సెంటర్‌లోని సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసుకొని, వెంటనే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇస్తారు. వారి నుండి తక్షణమే సహాయం పొందవచ్చు.

112కు ఫోన్‌ చేస్తే బాధితులు ఉన్న లొకేషన్‌తో పాటు కాల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో చిరునామా కూడా తెలుస్తుంది. పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని బాధితులకు రక్షణ కల్పిస్తారు.

181కు ఫోన్‌ చేస్తే రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌ కాల్‌ సెంటర్‌కు వెళ్తుంది. మహిళలు తమ సమస్యను చెబితే పోలీసులకు సమాచారం పంపి వారిని అప్రమత్తం చేస్తారు.