Telugu Global
International

నిత్యనూతనం లియాండర్ పేస్

టెన్నిస్ కోసం అలుపెరుగని పోరాటం 1990 నుంచి 2019 వరకూ ప్రస్థానం భారత టెన్నిస్ ఎవర్ గ్రీన్ స్టార్ లియాండర్ పేస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 46 ఏళ్ల లేటు వయసులో ఓ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆటకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదని చాటి చెప్పాడు. డేవిస్ కప్ టెన్నిస్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకొన్నాడు. లియాండర్ పేస్…భారత, ప్రపంచ టెన్నిస్ అభిమానులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. […]

నిత్యనూతనం లియాండర్ పేస్
X
  • టెన్నిస్ కోసం అలుపెరుగని పోరాటం
  • 1990 నుంచి 2019 వరకూ ప్రస్థానం

భారత టెన్నిస్ ఎవర్ గ్రీన్ స్టార్ లియాండర్ పేస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 46 ఏళ్ల లేటు వయసులో ఓ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆటకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదని చాటి చెప్పాడు. డేవిస్ కప్ టెన్నిస్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకొన్నాడు.

లియాండర్ పేస్…భారత, ప్రపంచ టెన్నిస్ అభిమానులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. కేవలం టెన్నిస్ కోసమే పుట్టిన ఈ మొనగాడు 46 సంవత్సరాల లేటు వయసులోనూ డేవిస్ కప్ డబుల్స్ లో భారతజట్టుకు విజయం అందించి తన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును తానే అధిగమించడం ద్వారా వారేవ్వా… అనిపించుకొన్నాడు.

18 మాసాల నిరీక్షణ..

భారత డేవిస్ కప్ జట్టులో చోటు కోసం గత 18 మాసాలుగా నిరీక్షించిన పేస్..అందివచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ప్రపంచ రికార్డు సాధించాడు.

కజకిస్థాన్ రాజధాని నూర్- సుల్తాన్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ముగిసిన ఆసియా-ఓషియానా గ్రూప్-1 పోటీలో కీలక విజయం అందించాడు.డేవిస్ కప్ టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.

దేశభక్తుడు పేస్…

వ్యక్తిగత రికార్డుల కంటే దేశ, భారత టెన్నిస్ ప్రయోజనాలే ముఖ్యమని భావించే లియాండర్ పేస్ మరోసారి తన దేశభక్తిని చాటుకొన్నాడు. ఇస్లామాబాద్ వేదికగా పాకిస్థాన్ తో జరగాల్సిన డేవిస్ కప్ పోరుకు ప్రాణభయంతో పలువురు సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యారు.

అయితే ..46 సంవత్సరాల పేస్ మాత్రం తాను సిద్ధమంటూ భారత టెన్నిస్ సంఘానికి తెలిపాడు. యువఆటగాళ్లతో కలసి ఆడటానికి ఆమోదం తెలిపాడు.

చివరకు తటస్థవేదికగా ఎంపికైన నూర్-సుల్తాన్ ఎముకలు కొరికే చలివాతావరణంలో భారతజట్టు తరపున బరిలో నిలచి కీలక డబుల్స్ లో విజయం అందించాడు.

సింగిల్స్ లో రామ్ కుమార్, సుమిత్ నగాల్ విజయాలు అందిస్తే…కీలక డబుల్స్ లో జీవన్ నెడుంజెళియన్ తో జంటగా పోటీకి దిగిన పేస్ 6-1, 6-3,తో పాక్ జోడీ రెహ్మాన్- షోయబ్ లతో ముగిసిన ఏకపక్ష సమరంలో…విజయం సాధించడం ద్వారా…సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేయగలిగాడు.

1990 – 2019

ప్రస్తుత భారత డేవిస్ కప్ శిక్షకుడు జీషన్ అలీతో కలసి..1990లో తన తొలి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన లియాండర్ పేస్…గత 29 సంవత్సరాలుగా…భారత జట్టులో సభ్యుడిగా కొనసాగుతూనే ఉన్నాడు.

అంతేకాదు…46 ఏళ్ల లేటు వయసులో సైతం…కుర్రాడిలా రాణిస్తూ ….ప్రతిభకు, అంకితభావానికి… వయసుతో ఏమాత్రం పనిలేదని చాటిచెప్పాడు.

46 ఏళ్ల వయసులో 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించడంతో పాటు..ఇప్పటికే 57 డేవిస్ కప్ మ్యాచ్ లు ఆడిన పేస్.. 44 విజయాలతో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.

డేవిస్ కప్ డబుల్స్ లో ఇప్పటి వరకూ 44 విజయాలు సాధించడం ద్వారా…ఇటలీ ప్లేయర్ నికోలా పీట్రాంజెలీ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును పేస్…… తెరమరుగు చేశాడు.

గ్రాండ్ స్లామ్ డబుల్స్ కింగ్…

భారత టెన్నిస్ చరిత్రలోనే అత్యధికంగా 18 గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించిన ఏకైక ఆటగాడు లియాండర్ పేస్ మాత్రమే.

పురుషుల డబుల్స్ తో పాటు… మిక్సిడ్ డబుల్స్ లో సైతం కెరియర్ గ్రాండ్ స్లామ్ సాధించిన ఘనత కేవలం పేస్ కు మాత్రమే దక్కుతుంది.

1999 సీజన్లో ప్రపంచ డబుల్స్ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా నిలిచిన పేస్ కు మహేశ్ భూపతితో కలసి గ్రాండ్ స్లామ్ లోని వింబుల్డన్, ఫ్రెంచ్, యూఎస్ , ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్స్ సాధించిన రికార్డు ఉంది.

అంతేకాదు…మిక్సిడ్ డబుల్స్ లో సైతం వివిధ దేశాలకు చెందిన భాగస్వాములతో కలసి 10 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

ఒలింపిక్స్ పతక విజేత పేస్…

లియాండర్ పేస్ విజయాలు, రికార్డులు కేవలం డేవిస్ కప్ కు మాత్రమే పరిమితం కాలేదు. 1996 ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ లో భారత్ కు కాంస్య పతకం అందించిన ఏకైక భారత ఆటగాడు లియాండర్ పేస్ మాత్రమే.

భారత టెన్నిస్ కే దశాబ్దాల తరబడి మకుటాయమానంగా నిలిచిన పేస్ ను ప్రభుత్వం పలువిధాలుగా సత్కరించింది. దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న, అర్జున, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది.

భారత క్రికెట్లో సచిన్ టెండుల్కర్, చెస్ లో విశ్వనాథన్ ఆనంద్, బ్యాడ్మింటన్ లో ప్రకాశ్ పడుకోన్, బిలియర్డ్స్ అండ్ స్నూకర్ లో పంకజ్ అద్వానీ ఎంతటి మొనగాళ్లో.. భారత టెన్నిస్ లో లియాండర్ పేస్ అంతే ఘనుడని చెప్పాల్సిన పనిలేదు.

డేవిస్ కప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన డబుల్స్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించిన పేస్ ప్రస్థానం మరెంతకాలం కొనసాగుతుందో వేచిచూడాల్సిందే.

First Published:  1 Dec 2019 8:52 PM GMT
Next Story