నిర్భయ హంతకులను ఉరి తీసే వ్యక్తి కావాలి…

దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ నిర్భయ ఘటన దోషులకు మరో నెల రోజుల్లో మరణ శిక్ష అమలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు ఉరి తీసే తలారీ కోసం వెతుకుతున్నారు.

తీహార్‌ జైలులో ప్రస్తుతం తలారీ లేకపోవడంతో కాంట్రాక్టు ప్రాతిపదికనైనా తలారీని నియమించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిర్భయ ఘటనలో నలుగురికి సుప్రీం కోర్టు ఉరి శిక్షను ఖాయం చేసింది. వారిలో వినయ్ శర్మ అనే దోషి మాత్రమే క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నాడు.

రాష్ట్రపతి వద్ద ఆ వినతి పెండింగ్‌లో ఉంది. రాష్ట్రపతి నుంచి నిర్ణయం రాగానే ఉరి తీయనున్నారు. మిగిలిన దోషులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోలేదు. వినయ్‌ శర్మ పిటిషన్‌ను తీహార్ జైలు అధికారులు ఢిల్లీ సర్కారుకు పంపించగా… ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకొని దాన్ని లెఫ్టినెంట్ గవర్నరుతోపాటు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లు తిరస్కరించారు.

ఆ తర్వాత పిటిషన్ కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్రపతి పరిశీలనకు వెళ్లింది. నిర్భయ ఘటనలో దోషులకు క్షమాభిక్ష పెట్టవద్దని ఇప్పటికే రాష్ట్రపతికి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది.

ఈ నేపథ్యంలో ఉరికి అవసరమైన ఏర్పాట్లను తీహార్ జైలు అధికారులు చేస్తున్నారు. తలారీని సమీకరించుకోవడం వారికి పెద్ద సవాల్‌గా మారింది. నిర్బయ ఘటనలో మొత్తం ఆరుగురు పాల్గొనగా ఒకడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు బాల నేరస్తుడు. వినయ్‌ శర్మ, ముకేష్‌, పవన్‌, అక్షయ్‌లకు మరణ శిక్ష పడింది.