రోజర్ ఫెదరర్ కు అరుదైన గౌరవం

  • ఫెదరర్ ముఖచిత్రంతో స్విస్ నాణాలు
  • 20 ఫ్రాంక్ ల వెండి, 50 ఫ్రాంక్ ల బంగారు నాణాలు

ప్రపంచ టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్, స్విట్జర్లాండ్ ముద్దుబిడ్డ రోజర్ ఫెదరర్ ఓ అరుదైన గౌరవం దక్కించుకొన్నాడు. తమ దేశానికి విశ్వఖ్యాతి తెచ్చిన ఫెదరర్ ను అరుదైన రీతిలో సత్కరించాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది.

బ్యాక్ హ్యాండ్ షాట్ ఆడుతున్న ఫెదరర్ ముఖచిత్రంతో 20 ఫ్రాంక్ లు, 50 ఫ్రాంక్ ల నాణేలు విడుదల చేయాలని స్విస్ ప్రభుత్వం నిర్ణయించింది.

20 ఫ్రాంక్ ల వెండి నాణేలు చలామణిలోకి రాగా…50 ఫ్రాంక్ ల బంగారు నాణేలను వచ్చే ఏడాది ముద్రించాలని నిర్ణయించింది.

30 ఫ్రాంక్ ల ఖరీదుకే ఫెదరర్ నాణేలను విక్రయించనున్నట్లు స్విస్ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 95వేల ఫెదరర్ నాణేలను ముద్రించనుంది.

స్విట్జర్లాండ్ చరిత్రలో సజీవంగా ఉన్న ఓ ప్రముఖవ్యక్తి ముఖ చిత్రంతో నాణేలు ముద్రించడం ఇదే మొదటిసారి.

గత రెండుదశాబ్దాలుగా అంతర్జాతీయ టెన్నిస్ లో టాప్ స్టార్లలో ఒకడిగా ఉంటూ వస్తున్న రోజర్ ఫెదరర్ కు రికార్డు స్థాయిలో 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన రికార్డు ఉంది. 38 ఏళ్ల వయసులో సైతం యువఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటూ ప్రపంచ మూడో ర్యాంక్ లో కొనసాగుతున్న ఫెదరర్… కవల ఆడపిల్లలు, కవల మగపిల్లల కు తండ్రికావడం విశేషం.