మోడీ ఆఫర్‌ను తిరస్కరించా…

మహారాష్ట్ర రాజకీయం రసవత్తరంగా నడుస్తున్న సమయంలో మోడీ, శరద్ పవార్‌ భేటీ గత నెలలో జరిగింది. శరద్‌ పవార్‌కు రాష్ట్రపతి పదవిని మోడీ ఆఫర్ చేశారన్న వార్తలొచ్చాయి. అసలు ఆరోజు ఏం జరిగింది అన్న దానిపై ఒక చానల్ ఇంటర్వ్యూలో శరద్‌ పవారే సమాధానం చెప్పారు.

మోడీ తనకు ఆఫర్ ఇచ్చింది నిజమేనని చెప్పారు. కానీ అది రాష్ట్రపతి పదవి కాదన్నారు. కలిసి పనిచేద్దామని మోడీ ఆహ్వానించారని… కానీ మన మధ్య వ్యక్తిగత సంబంధాలు బాగానే ఉన్నాయి… వాటిని అలాగే కొనసాగనిద్దం… అంతే కానీ రాజకీయంగా కలిసి పనిచేయడం సాధ్యం కాదు అని మోడీకి నేరుగా చెప్పేశానని శరద్ పవార్ వెల్లడించారు.

కలిసి పనిచేసేందుకు అంగీకరించి ఉంటే తన కుమార్తె సుప్రియా సూలేకు కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పిస్తామని మోడీ చెప్పారని వివరించారు. బీజేపీతో చేతులు కలిపినందుకే అజిత్ పవార్‌కు మహారాష్ట్ర కేబినెట్‌లో చోటు కల్పించలేదని పవార్ చెప్పారు.

నువ్వు క్షమించరాని తప్పు చేశావు అందుకు ఫలితం అనుభవించాల్సిందే అని అజిత్‌కు చెప్పానన్నారు. ‘అజిత్‌ బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలియగానే ఉద్ధవ్‌ ఠాక్రేకు ఫోన్‌ చేశానని… అజిత్‌ అలా చేసి ఉండకూడదు.. నాపై నమ్మకముంచండి.. ఆ తిరుగుబాటును అణిచివేస్తానని ఠాక్రేకు తెలిపా’అని పవార్ వెల్లడించారు.