ఉద్యోగం కోసం గద్దర్ దరఖాస్తు

ప్రజాగాయకుడు గద్దర్ స్వరం మారుతోంది. చాలా కాలంగా ఆయన భావాల్లోనూ మార్పు వస్తోంది. స్వయంగా రాహుల్ గాంధీని కలిసి తన కుమారుడిని కాంగ్రెస్‌ పార్టీలో చేర్పించిన గద్దర్… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబును ఆకాశానికెత్తారు. తన శరీరంలో బాబు ప్రభుత్వం దింపిన బుల్లెట్లు ఉన్నప్పటికీ చంద్రబాబును హత్తుకున్నారు గద్దర్.

తాజాగా తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగం కోసం గద్దర్ దరఖాస్తు పెట్టుకున్నారు. సాంస్కృతిక సారథిలో ఉద్యోగం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని గద్దర్ ధృవీకరించారు. పాటకు, కళకు, అక్షరానికి… వయసు, కులం, ప్రాంతంతో సంబంధం ఉండదని… తాను కోరుకున్నది కళాకారుని ఉద్యోగమేనని, ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలను వివరించేందుకు అవకాశం వస్తుందని భావించి దరఖాస్తు పెట్టుకున్నానని తెలిపారు. తన తరపున అందరూ కొట్లాడి ఉద్యోగం వచ్చేలా చూడాలని కోరారు.

73 ఏళ్ళ వయసులో తాను ఆడి, పాడకపోయినా ఇప్పుడున్న కళాకారులు పాడుతుంటే వాళ్ళ వద్ద డప్పులు మోస్తానని చెప్పారు. రసమయి బాలకిషన్ తనను కలవలేదని …. కొంతమంది మిత్రులతో నా గురించి రసమయి చర్చించారని తెలిపారు.

ప్రస్తుతం నిశ్శబ్దమే ఒక ప్రొటెస్ట్ రూపంగా కనిపిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో తాను ఉద్యోగం గురించి చేసిన దరఖాస్తుపై చర్చ జరిగితే సంతోషమేనని గద్దర్ వ్యాఖ్యానించారు.