వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే నకిలీ సిఫార్సు లేఖతో రామ్మోహన్ రెడ్డికి పదవి !?

నంద్యాల ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్త రామ్మోహన్ రెడ్డిని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక వర్గ సభ్యుడిగా నియమించడం దుమారం రేపుతోంది. గతంలో ప్రజారాజ్యంలో చేరి వైఎస్‌పై అనేక అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు.. ఏనాడూ వైసీపీ జెండా పట్టుకోని వ్యక్తికి పదవి ఎలా ఇచ్చారన్న దానిపై వైసీపీ శ్రేణులు పెద్దెత్తున ప్రశ్నిస్తున్నాయి.

పదవి పొందిన రామ్మోహన్ రెడ్డి దివంగత ఎస్పీవై రెడ్డి అన్న చుట్టరెడ్డికి అల్లుడు. రామ్మోహన్ రెడ్డికి పదవి దక్కడం వెనుక లాబీయింగ్ పనిచేసిందన్న ఆరోపణలూ వచ్చాయి.

తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. రామ్మోహన్ రెడ్డి నియామకం నంద్యాల వైసీపీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సిఫార్సు ఆధారంగానే జరిగింది అంటూ ఆ లేఖలను కూడా కొందరు పెద్దలు బయటకు విడుదల చేశారు. కానీ ఆ లేఖలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోచా బ్రహ్మానందరెడ్డి ఎలాంటి సిఫార్సు లేఖ ఇవ్వలేదని ఆయనతో పాటు ఉండే వ్యక్తులు చెబుతున్నారు. ఇక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సిఫార్సు లేఖపై అసలు తేదీనే లేదు. అన్నింటికి మించి ఒకవేళ ఈ రెండు సిఫార్సు లేఖలు నిజమైనవే అనుకున్నా… ఈ రెండు సిఫార్సు లేఖల్లోనూ రామ్మోహన్ రెడ్డిని రాయలసీమ వర్శిటీ పాలన వర్గసభ్యుడిగా నియమించండి అని మాత్రమే ఉంది.

ఒకవేళ ఎంపీ, ఎమ్మెల్యే సిఫార్సు నిజమైనదే అనుకున్నా… వారు రాయలసీమ వర్శిటీ సభ్యుడిగా సిఫార్సు చేస్తే అందులో కాకుండా అత్యంత కీలకమైన ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రామ్మోహన్ రెడ్డికి సభ్యుడిగా ఎలా అవకాశం కల్పించారు అంటూ కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో భగ్గుమంటున్నారు.

రామ్మోహన్ రెడ్డి తన బయోడేటాలో చదువు గురించి ఏఎంఐఈ చెన్నై అని రాశారు. ఇది కూడా అవాస్తమని వైసీపీ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సర్టిఫికేట్ చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి వివరణ వచ్చే వరకు ఈ వివాదానికి తెరపడే సూచనలు కనిపించడం లేదు.

రామ్మోహన్ రెడ్డికి ఒకే ఇల్లు ఉండగా… దానిపైనే 8 నెంబర్లు సంపాదించి బ్యాంకులను బురిడీ కొట్టించారంటూ అందుకు సంబంధించిన ఆధారాలను కూడా వైసీపీ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రామ్మోహన్ రెడ్డి సూట్‌ కేసు కంపెనీలు నడుపుతున్నారంటూ ఇటీవల సీబీఐ దాడులు కూడా చేసిందని వివరిస్తున్నారు.