బాలసుబ్రమణ్యంతో తిట్లు తిన్న తమన్

ఇకపై రీమిక్స్ చేయనని ప్రకటించాడు తమన్. రీమిక్స్ చేసిన ప్రతిసారి బాలు గారు ఫోన్ చేసి తిడుతున్నారని, ఆయనతో పాటు అంతా తిట్టుకుంటున్నారని, అందుకే రీమిక్స్ చేయనని ప్రకటించాడు ఈ స్టార్ కంపోజర్.

“ఇకపై రీమిక్స్ చేయను. కారణం ఆ మ్యూజిక్ డైరెక్టర్ , సింగర్ , లిరిక్ రైటర్ నన్ను తిట్టుకుంటారు. బాలు గారు ఫోన్ చేసి మరీ తిడతారు. ఎప్పుడైనా అడుగుతారు…. ఎందుకు రా మనకి ఈ టెన్షన్ అంటారు. కొన్నేళ్ళ తర్వాత నా సాంగ్ ఎవరైనా రీమిక్స్ చేస్తే నేనే తిట్టుకుంటాను. అందుకే ఇకపై రీమిక్స్ చేయకూడదని నిర్ణయించుకున్నాను.”

తను చేసే పనిపై కచ్చితంగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటానంటున్నాడు తమన్. ఆడియన్స్ కు నచ్చకపోతే, వాళ్లకు నచ్చేలా కష్టపడతానని, మంచి పాట వచ్చిన తర్వాత మళ్లీ వాళ్లనే అడుగుతానని అంటున్నాడు తమన్. ప్రస్తుతం తనకు హిట్స్ ఉన్నప్పటికీ, పారితోషికం మాత్రం ఎక్కువ డిమాండ్ చేయడం లేదని స్పష్టంచేశాడు.

“ఏ పనికైనా ఫీడ్ బ్యాక్ అనేది తప్పకుండా తీసుకోవాలి. అందుకే ట్విట్టర్ లో అందరితో ఇంట్రాక్ట్ అవుతుంటాను. ఎప్పటికప్పుడు వారి నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంటాను. వారిచ్చిన ఫీడ్ బ్యాక్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ నెక్స్ట్ సినిమాకు వర్క్ చేస్తా. నిజానికి ఎవరైనా ఊరికే ట్వీట్ వేయరు కదా.. సో అలా ఆలోచిస్తాను. వాణ్ణి హ్యాపీ చేయాలని మళ్ళీ వర్క్ చేస్తుంటాను. ఆ తర్వాత మొన్న నచ్చలేదు కదా… ఈ సాంగ్ ఎలా ఉంది అని అడిగి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాను.”

అల వైకుంఠపురములో సామజవరగమన సాంగ్ కు 10 మిలియన్ వ్యూస్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యాడు తమన్. ఇది కేవలం తన ఒక్కడి కృషి కాదని, అంతా సపోర్ట్ గా నిలిచారని చెప్పుకొచ్చాడు.