ఒక రోజు ఆలస్యంగా కార్తికేయ సినిమా

లెక్కప్రకారం ఈరోజు థియేటర్లలోకి రావాలి కార్తికేయ సినిమా. కానీ ఒక రోజు ఆలస్యంగా రేపు రిలీజ్ అవుతోంది. దీనికి కారణం ఈ సినిమాకు సెన్సార్ సమస్యలు తలెత్తడమే. ఏకంగా సినిమాకు 90ఎంఎల్ అనే టైటిల్ పెట్టారు. సినిమాలో హీరోను తాగుబోతుగా చూపించారు. చాలా సీన్స్ లో మద్యం బాటిళ్లు ఉన్నాయి. డైలాగ్స్ కూడా అలానే ఉన్నాయి. వీటికి తోడు కాస్త ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు కూడా.

అందుకే ఈ సినిమాకు సెన్సార్ కంప్లీట్ చేయడానికి అధికారులు కాస్త టైమ్ తీసుకున్నారు. మొత్తానికి చిన్నచిన్న కట్స్ తో సెన్సార్ ఇచ్చారు. అలా సెన్సార్ ఫార్మాలిటీస్ లేట్ అవ్వడంతో, విడుదల కూడా ఆలస్యమైంది.

ఇక కథ విషయానికి వస్తే ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు `దేవ‌దాస్‌`, ఎంబీఏ గోల్డ్ మెడ‌లిస్ట్. అంత‌టి విద్యావంతుడు ‘ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌’ గా ఎందుకు అయ్యాడన్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. నేహా సోలంకిని హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకి పరిచయం చేస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా శేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.