గ్రామాల్లో పోకిరీల డేటా సేకరిస్తున్న పోలీసులు

తెలంగాణ దిశ ఉదంతం నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఉదంతాల్లో ఎక్కువగా ఆకతాయిలు, పనిపాటలేని పోకిరీలే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో గ్రామాల్లో పోకిరీల లెక్కలు తీస్తున్నారు తెలంగాణ పోలీసులు. పట్టణాలతో పాటు గ్రామాల్లో అల్లరిచిల్లరగా తిరిగే వారి వివరాలు సేకరిస్తున్నారు.

వేషభాషల్లో తేడా ఉండడం, దిశ హంతుకుల తరహాలోనే చిత్రవిచిత్రంగా హెయిర్‌ స్టైల్‌తో తిరిగే వారిని గుర్తించి వారి వివరాలను స్థానిక పోలీసు స్టేషన్‌లో ఉంచనున్నారు. ఇలాంటి పోకిరీల వివరాలతో ప్రత్యేక ఫైల్‌ను తయారుచేయబోతున్నారు. అమ్మాయిలను టీజ్ చేయడం, అమ్మాయిలను వేధించడం వంటి వ్యవహారాల్లో ఉన్న పోకిరీల వివరాలను పోలీస్ స్టేషన్‌లో ఉంచనున్నారు.

అటు… దిశ ఘటనను సమర్ధిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన ఉన్మాదులను పోలీసులు వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. సాయినాథ్‌ అలియాస్ స్మైల్ నాని అనే మరో యువకుడిని హైదరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

గుంటూరులోని అమరావతి కొండయ్య కాలనీలో సాయినాథ్‌ కుటుంబం నివాసం ఉంటోంది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయినాథ్‌ అత్యంత దారుణమైన, ప్రమాదకరమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేశారు.

సాయినాథ్ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ శ్రీరామ్ అనే మరో యువకుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరామ్‌తో పాటు మరికొందరు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.