పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే తలలు నరికి చూపించాలి – ఇదే మా సవాల్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఆదేశిస్తే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి తలతో పాటు ఏ రెడ్డి తలనైనా నరికేందుకు సిద్ధమంటూ పవన్ కల్యాణ్ సమక్షంలోనే జనసేన నేత సాకే పవన్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి స్పందించారు.

పవన్‌ కల్యాణ్ మైకులు ఇచ్చి నేతలతో ఇలా మాట్లాడిస్తున్నారన్నారని తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి ఆరోపించారు. ఇంతకాలం పవన్ కల్యాణ్‌కు విజ్ఞత ఉందని భావించానని…కానీ ఇప్పుడు కులాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడిస్తున్నారని విమర్శించారు. సాకే పవన్ అనే వ్యక్తి ఎవరో నియోజకవర్గంలో తమకు తెలియదన్నారు. వాళ్లు తలలు నరకాలనుకుంటే ఆహ్వానిస్తున్నామని… వచ్చి ఆ పని చేయాలని సవాల్ చేశారు. పోలీసులు, చట్టమే వారికి సమాధానం చెబుతుందన్నారు.

ఇలాంటి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడిస్తే పవన్ కల్యాణ్‌కు తగిన శాస్తి తప్పక జరుగుతుందన్నారు. తలలు నరుకుతామంటున్న వ్యక్తులతో పాటు పవన్ కల్యాణ్‌ కూడా అనంతపురం జిల్లాకు రావాలని… వచ్చి ఎంత మంది తలలు నరుకుతారో చూపించాలని సవాల్ చేశారు.

జనసేన అధ్యక్షుడితో తనకు ఎలాంటి గట్టు పంచాయితీలు లేవని… ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు మాట్లాడిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. జిల్లా ఎస్పీని కలిసి ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు. పవన్ కల్యాణ్‌ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేసినందున ఈ వ్యాఖ్యలను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణే చేసినట్టుగా తాము భావిస్తున్నామని… కాబట్టి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణే అనంతపురం రావాలని … ఎంత మంది తలలు నరుకుతారో చూపించాలని ప్రకాశ్‌ రెడ్డి సవాల్ చేశారు.

ఈవ్యాఖ్యలతో పవన్ కల్యాణ్‌కు సంబంధం లేకపోతే ఖండించాలని… ఆయనే ఈ వ్యాఖ్యలు చేయించి ఉంటే అనంతపురం జిల్లాకు వచ్చి తలలు నరికి చూపించాలని చాలెంజ్ చేశారు.