ఎన్‌కౌంటర్‌పై దిశ తల్లిదండ్రులు, సినీ హీరోల స్పందన

దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌పై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. దిశకు న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. అమ్మాయిలపై ఇలాంటి దాడి చేయాలంటే మరొకరు భయపడేలా చేశారని దిశ తండ్రి వ్యాఖ్యానించారు. సజ్జనార్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసు కోర్టు ద్వారానే తేలుతుందేమో అనుకున్నామని… కానీ ఇలావెంటనే న్యాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

ఎన్‌కౌంటర్‌ పట్ల జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున తదితరులు హర్షం వ్యక్తం చేశారు. దిశకు న్యాయం జరిగింది అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌ చేశారు.

ఎన్ కౌంటర్ చేసిన పోలీసులకు కాళ్లు మొక్కాలనిపిస్తోందని హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశారు. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు ఉందా? ఈ రోజే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా అంటూ మనోజ్ ట్వీట్ చేశారు.

రేపిస్టులను చంపే హక్కు ఎవరికీ లేదు… రేపిస్టులను కేవలం నాలుగు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయాలన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంకా ఈ ఎన్‌కౌంటర్‌పై స్పందించలేదు. రేపిస్టులను చంపకూడదని వ్యాఖ్యానించిన పవన్ కల్యాణ్… ఈ ఎన్‌కౌంటర్‌ పై ఎలా స్పందిస్తాడో చూడాలి.