దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు ఇది…

హైదరాబాద్‌ దిశ హంతకులను పోలీసులు కాల్చి చంపేశారు. నిందితులు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు నలుగురిని ఎన్‌కౌంటర్ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తున్న సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కాల్చి చంపేశారు.

పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు పోలీసులపై దాడికి ప్రయత్నించడంతో ఎన్‌కౌంటర్ చేసినట్టు పోలీసులు వివరించారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు తమ వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించారని… అందుకే కాల్చి చంపామని పోలీసులు చెప్పారు. తెల్లవారుజామున 3.30 సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

ఎన్‌కౌంటర్‌ గురించి తెలియగానే పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సీపీ సజ్జనార్‌ ఘటన స్థలిని పరిశీలించారు. ఈనెల 28న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పోలీసు కస్టడీకి ఇటీవల కోర్టు ఇచ్చింది. నిన్న చర్లపల్లి జైలులో నలుగురు ఖైదీలను విచారించిన పోలీసులు… ఘటన జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చిపడేశారు.