శాఫ్ గేమ్స్ లో భారత్ పతకాల సెంచరీ

  • పోటీల నాలుగోరోజునే 56 పతకాలు

2019 దక్షిణాసియా దేశాల క్రీడల్లో శాఫ్ సూపర్ పవర్ భారత పతకాల జైత్రయాత్ర కొనసాగుతోంది. పోటీల నాలుగోరోజునే భారత అథ్లెట్లు 56 పతకాలు సాధించడంతో…. మొత్తం 100 పతకాల లక్ష్యాన్ని అలవోకగా చేరుకొని…పతకాల పట్టిక అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలిగింది.

నేపాల్ రాజధాని ఖట్మండూ, పోక్రా నగరాల వేదికలుగా జరుగుతున్న 13వ శాఫ్ గేమ్స్ నాలుగోరోజు పోటీలలో భాగంగా జరిగిన ఉషు, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్,  ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. ఒకటి కాదు…రెండు కాదు …రికార్డు స్తాయిలో 56 పతకాలు సొంతం చేసుకొన్నారు.

భారత్ మొత్తం 62 స్వర్ణ, 41 రజత, 21 కాంస్యాలతో సహా 121 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఆతిథ్య నేపాల్ 101 పతకాలతో రెండు, శ్రీలంక 107 పతకాలతో మూడు స్థానాలలో కొనసాగుతున్నాయి. నేపాల్ 37స్వర్ణాలు సాధిస్తే…శ్రీలంక 17 బంగారు పతకాలు మాత్రమే గెలుచుకోగలిగింది. భారత అథ్లెట్లు పోటీల నాలుగోరోజునే 30 స్వర్ణ, 18 రజత, 8 కాంస్య పతకాలు అందుకోడం విశేషం

సాకర్ లో భారత్ టాప్ గేర్

మహిళల ఫుట్ బాల్ లో భారత్ 6-0 గోల్స్ తో శ్రీలంకను చిత్తు చేయడం ద్వారా బంగారు వేట మొదలు పెట్టింది. పోటీల ప్రారంభ మ్యాచ్ లో మాల్తీవులను 5-0తో అలవోకగా ఓడించిన భారత మహిళలకు ఇది వరుసగా రెండో గెలుపు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టైటిల్ వేటకు దిగిన భారత్ కు బంగ్లాదేశ్, నేపాల్ జట్ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.