ఆనం వ్యాఖ్యలపై అనిల్ స్పందన ఇది…

బీదా మస్తాన్‌రావు వైసీపీలో చేరిక వల్ల అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్. చాలా మంది వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

బీదా మస్తాన్‌రావు పార్టీలో చేరిన సందర్బంగా మాట్లాడిన అనిల్ కుమార్‌… టీడీపీ ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకుంటామని జగన్‌మోహన్ రెడ్డి ఒక్క మాట చెబితే టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా… ఎక్కడ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అనర్హత వేటు వేస్తుందో అన్నభయంతో ఆగిపోతున్నారని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.

నెల్లూరులో మాఫియా పెరిగిపోయిందంటూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన్నే వివరణ అడగాలని కోరారు. జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా మాఫియాలు లేకుండా పోయాయన్నారు. ఆ విషయం అందరికీ తెలుసన్నారు.

ఆనం రామనారాయణరెడ్డి గత ప్రభుత్వం గురించి మాట్లాడారేమో… దానిపై క్లారిటీ తీసుకోవాలని మీడియాను కోరారు. జిల్లాలో జగన్‌మోహన్ రెడ్డి ఎజెండాతోనే ముందుకెళ్తాంగానీ వ్యక్తిగత ఎజెండా ఏ నాయకుడికి లేదన్నారు అనిల్.