విండీస్ తో తొలి టీ-20లో భారత్ షో

  • కొహ్లీ మాస్టర్ క్లాస్ బ్యాటింగ్ తో 6 వికెట్ల విజయం
  • హైదరాబాద్ రాజీవ్ స్టేడియంలో హైస్కోరింగ్ వార్

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో ప్రారంభమైన తీన్మార్ టీ-20 సిరీస్ తొలిమ్యాచ్ లో ఆతిథ్య భారత్ 6 వికెట్ల విజయంతో బోణీ కొట్టింది.

హైస్కోరింగ్ మ్యాచ్ గా సాగిన ఈ పోరులో విరాట్ కొహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ తో తనజట్టుకు సూపర్ చేజింగ్ విజయం అందించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 

పరుగుల వెల్లువ…

హైదరాబాద్ వేదికగా గత సీజన్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ల్లో సగటున 162 పరుగుల స్కోర్లు మాత్రమే నమోదుకాగా… ప్రస్తుత సీజన్ తొలిమ్యాచ్ లో మాత్రం 200కు పైగా స్కోర్లు నమోదు కావడం విశేషం.

రెండేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ వేదికగా జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయమ్యాచ్ లో భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు.

దీంతో బ్యాటింగ్ కు దిగిన కరీబియన్ టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగుల భారీస్కోరు సాధించింది. ఓపెనర్ ఇవిన్ లూయిస్ 40, హెట్ మేయర్ 56, కెప్టెన్ పోలార్డ్ 37 పరుగులు సాధించగా…భారత బౌలర్లలో చహాల్ 2 వికెట్లు, చహార్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

రాహుల్- కొహ్లీ సెంచరీ భాగస్వామ్యం..

విండీస్ భారీస్కోరుకు సమాధానంగా 208 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ ప్రారంభఓవర్లలోనే డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ నష్టపోయింది. 

అయితే…మరో ఓపెనర్ రాహుల్ తో కలసి కెప్టెన్ రెండో వికెట్ కు సెంచరీభాగస్వామ్యంతో పరుగుల మోత మోగించాడు.
రాహుల్ 40 బాల్స్ లో 4 బౌండ్రీలు, 5 సిక్సర్లతో 62 పరుగులకు అవుటయ్యాడు.

కెప్టెన్ కొహ్లీ మాత్రం తన బ్యాట్ కు పూర్తిస్థాయిలో పని చెప్పి…టీ-20 కెరియర్ లోనే అత్యుత్తమంగా 94 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. మరో 8 బాల్స్ మిగిలిఉండగానే తనజట్టుకు 6 వికెట్ల విజయం అందించాడు.

కొహ్లీ మెరుపు బ్యాటింగ్ లో 6 బౌండ్రీలు, 6 సిక్సర్లు ఉన్నాయి. రిషభ్ పంత్ 18, శ్రేయస్ అయ్యర్ 4 పరుగులకు చిక్కారు, విండీస్ బౌలర్లలో పియరీ 2 వికెట్లు, కోట్రెల్, పోలార్డ్ చెరో వికెట్ పడగొట్టారు.

భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని రెండో వన్డే తిరువనంతపురం వేదికగా ఆదివారం జరుగనుంది.

మొత్తం మీద…రెండుసంవత్సరాల విరామం తర్వాత హైదరాబాద్ వేదికగా ముగిసిన టీ-20 మ్యాచ్ లో రెండుజట్లు కలసి 40 ఓవర్లలో 417 పరుగులు సాధించడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది. రాజీవ్ స్టేడియం వేదికగా ఓ అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం.