పూజా వచ్చింది…. పండగ చేసుకుంటున్న అఖిల్

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా షెడ్యూల్స్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ చేయాలి లాంటి అంశాలన్నీ ఇప్పుడు హీరోయిన్ పూజా హెగ్డే చేతిలో ఉన్నాయి.

అవును.. ఆమె కాల్షీట్ ఇస్తేనే షూటింగ్ ముందుకెళ్తుంది. ఆమె కాల్షీట్లపైనే సినిమా రిలీజ్ డేట్ ఆధారపడి ఉంది. ఎందుకంటే, పూజా హెగ్డే ఫుల్ బిజీ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, కొంచెంకొంచెంగా కాల్షీట్లు కేటాయిస్తోంది. దీంతో సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోంది.

ఇలా నెమ్మదిగా సాగుతున్న షూటింగ్ కు ఒక్కసారిగా ఊపొచ్చింది. అవును.. పూజా హెగ్డే బల్క్ లో ఈ సినిమాకు కాల్షీట్లు కేటాయించింది. దీని వెనక ఓ కారణం ఉంది. లెక్కప్రకారం ఆమె ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న జాన్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వాలి. కానీ ఆ సినిమా షూటింగ్ ను నెల రోజుల పాటు వాయిదావేశారు. అటు ప్రభాస్ కూడా విదేశాలకు వెళ్లిపోయాడు. దీంతో ఆ కాల్షీట్లను గంపగుత్తగా అఖిల్ సినిమాకు కేటాయించింది పూజ.

పూజా రాకతో యూనిట్ కో ఉత్సాహం పెరిగింది. దాదాపు 25 రోజుల కాల్షీట్లు దొరకడంతో యూనిట్ పండగ చేసుకుంటోంది. ఆ 25 రోజుల షూటింగ్ పూర్తయితే, దాదాపు పూజా హెగ్డే పోర్షన్ కంప్లీట్ అయినట్టే. ఆ వెంటనే రిలీజ్ డేట్ ప్రకటించబోతోంది యూనిట్. వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.