ఢిల్లీలో ఘోరం… 43మంది మృతి

ఆదివారం ఉదయం ఢిల్లీలో దారుణం జరిగింది. ఊహకందని ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీలోని ఆనాజ్ మండిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 43 మంది మరణించడం కలిచివేసింది. పలువురు మంటల్లో చిక్కుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

ఢిల్లీలోని అనాజ్ మండిలోని స్కూల్ బ్యాగ్స్, బాటిల్స్ తయారీ కంపెనీలో మంటలు అంటుకున్నాయి. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఆ భవనంలో చాలా మంది కార్మికులు నిద్రిస్తున్నారు. ఆదివారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఈ మంటలు వ్యాపించినట్టు అధికారులు చెబుతున్నారు.

మంటలు వ్యాపించిన భవనంలో స్కూల్ బ్యాగ్ లు పెద్ద మొత్తంలో ఉండడంతో శరవేగంగా విస్తరించాయని అధికారులు తెలిపారు. స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.

ఈ ప్రమాదంలో సుమారు 43 మంది మరణించగా.. గాయపడ్డవారిని ఢిల్లీలోని ఎల్ఎన్జీపీ ఆస్పత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. స్కూల్ బ్యాగ్ తయారీ పరిశ్రమలో ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.