విండీస్ పై సిరీస్ విజయానికి భారత్ రెడీ

  • తిరువనంతపురంలో నేడే రెండో టీ-20
  • తుదిజట్టులో చోటు కోసం సంజు శాంసన్ తహతహ

భారత్- విండీస్ జట్ల తీన్మార్ టీ-20 షో…హైదరాబాద్ నుంచి తిరువనంతపురానికి చేరింది. సూపర్ సండే ఫైట్ గా మరికొద్ది గంటల్లో జరిగే ఈ మ్యాచ్ లోనూ నెగ్గడం ద్వారా 2-0తో సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఆతిథ్య భారత్ ఉంది.

మరోవైపు…రెండోమ్యాచ్ నెగ్గడం ద్వారా సిరీస్ ను 1-1తో సమం చేయాలన్న పట్టుదలతో విండీస్ ఉంది. విండీస్ పై తిరుగులేని భారత్ టీ-20 పదవర్యాంకర్ విండీస్ ప్రత్యర్థిగా గత 13 మాసాలలో ఆరు మ్యాచ్ లు ఆడిన 5వ ర్యాంకర్ భారత్ కు నూటికి నూరుశాతం విజయాల రికార్డు ఉంది. మొత్తం ఆరుకు ఆరుమ్యాచ్ ల్లోనూ నెగ్గిన రికార్డు భారత్ కు ఉంది.

హైదరాబాద్ లో ముగిసిన హైస్కోరింగ్ తొలి టీ-20 సమరంలో 6 వికెట్లతో నెగ్గడం ద్వారా 1-0తో పైచేయి సాధించిన భారత్..తిరువనంతపురంలోనూ అదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది.

తనవంతు కోసం సంజు….

కేరళ డాషింగ్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ తనవంతు కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు గాయం కావడంతో..జట్టులో చోటు సంపాదించిన సంజు శాంసన్ ఓపెనర్ గా తన హోంగ్రౌండ్లో బరిలోకి దిగాలని భావిస్తున్నాడు. అయితే …భారత్ మాత్రం విన్నింగ్ కాంబినేషన్ తోనే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

బౌలర్లే కీలకం…

రెండుజట్లూ బ్యాటింగ్ లో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్నా…ఫీల్డింగ్ తో పాటు బౌలింగ్ లోనూ లోపాలను సవరించుకొని విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాయి.

కీరాన్ పోలార్డ్ నాయకత్వంలోని విండీస్ జట్టు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ నూ మెరుగుపరచుకోగలిగితే…భారత్ కు గట్టిపోటీ తప్పదు.

మరోవైపు…తొలి టీ-20లో విఫలమైన భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం..తిరువనంతపురం మ్యాచ్ లో భారీస్కోరు సాధించాలన్న కసితో ఉన్నాడు.

భారత్ 9- విండీస్ 5 రికార్డు..

టీ-20 ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ విండీస్, మాజీ చాంపియన్ భారత్ ..ఇటీవలి హైదరాబాద్ మ్యాచ్ వరకూ 14సార్లు తలపడితే..భారత్ 9 విజయాలు, విండీస్ 5 విజయాల రికార్డుతో ఉన్నాయి.

స్పిన్ బౌలర్లకు అనువుగా ఉండే తిరువనంతపురం వికెట్ పై 170కి పైగా స్కోరు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉన్నాయి. రాత్రి 7 గంటలకు ఈ సూపర్ సండే ఫైట్ ప్రారంభంకానుంది.