శాఫ్ గేమ్స్ 6వ రోజుకే భారత్ పతకాల డబుల్ సెంచరీ

  • 110 బంగారు పతకాలతో అగ్రస్థానం

ఖట్మండూ వేదికగా జరుగుతున్న 2019 శాఫ్ గేమ్స్ లో దక్షిణాసియా దేశాల సూపర్ పవర్ భారత్..ఆరవరోజు పోటీలు ముగిసే నాటికే పతకాల డబుల్ సెంచరీతో.. టేబుల్ టాపర్ గా తన స్థానాన్ని మరింత పటిష్ట పరచుకొంది.

పోటీల ఆరవరోజున భారత అథ్లెట్లు మరో 29 స్వర్ణాలతో సహా మొత్తం 49 పతకాలు సాధించి వారేవ్వా అనిపించుకొన్నారు. ఈత పోటీల పురుషుల, మహిళల విభాగాలలో భారత స్విమ్మర్లకు పోటీనే లేకుండా పోయింది.

భారత స్విమ్మర్లు 7 స్వర్ణ, ఒక్కో రజత, కాంస్యాలతో అత్యధిక పతకాలు సొంతం చేసుకోగలిగారు.ట్రాక్ అండ్ ఫీల్డ్ లోనే 48 పతకాలు సాధించిన భారత అథ్లెట్లు కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకోగలిగారు.

పోటీల 6వ రోజున భారత్ మొత్తం 214 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో 110 స్వర్ణ, 69 రజత, 35 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆతిథ్య నేపాల్ రెండు, శ్రీలంక మూడు స్థానాలలో నిలిచాయి.

పాకిస్థాన్ నాలుగు,బంగ్లాదేశ్ ఐదు, మాల్దీవులు ఆరు, భూటాన్ ఏడు స్థానాలలో నిలిచాయి. అఫ్ఘనిస్తాన్ అథ్లెట్లు కనీసం ఒక్క పతకమూ సాధించలేకపోయారు. 13వ శాఫ్ గేమ్స్ కు డిసెంబర్ 10న తెరపడనుంది.