మురారి బాటలో వెంకీమామ

వెంకీమామ ట్రయిలర్ రిలీజైంది. ఈ ట్రయిలర్ రిలీజ్ అయ్యేంతవరకు ఉన్న అంచనాలు, ఊహాగానాలు ఒకలా ఉండేవి. ట్రయిలర్ రిలీజైన తర్వాత ఈ సినిమాను చూసే విధానం పూర్తిగా మారిపోయింది. ట్రయిలర్ రిలీజ్ కు ముందు ఈ సినిమాలో కేవలం నాగచైతన్య, వెంకటేష్ రిలేషన్ షిప్, కెమిస్ట్రీ మాత్రమే జనాలకు కనిపించింది. కాస్త యాక్షన్, ఇంకాస్త కామెడీ కూడా కనిపించింది. కానీ నిన్న రిలీజైన ట్రయిలర్ చూసిన తర్వాత సినిమాను చూసే విధానం మారిపోయింది.

అవును.. వెంకీమామలో మురారి సినిమా లక్షణాలు ఉన్నాయట. జాతకరీత్యా ఒకరి వల్ల మరొకరికి ప్రాణగండం లాంటి అంశాల్ని, జాతకాల్ని ఈ సినిమాలో చర్చించినట్టు తెలుస్తోంది. మనుషుల తలరాతల్ని రాసే శక్తి దేవుడికి ఉందని, ఆ తలరాతల్ని తిరిగి రాసే శక్తి మనిషికి ప్రేమకు ఉంది అనే డైలాగ్ చూసినప్పుడే అందరి అనుమానాలు మొదలయ్యాయి.

సినిమా సెకెండాఫ్ ఎమోషనల్ గా ఉండడానికి ఈ జాతకాలు, సెంటిమెంట్లే కారణమని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. వెంకీ జాతకరీత్యా, అతడి మేనల్లుడు నాగచైతన్యకు ప్రాణగండం ఉందనేది కాన్సెప్ట్. నిజానికి సినిమా అంతా ఈ పాయింట్ చుట్టూనే తిరుగుతుందట. ఈ పాయింట్ ను బ్రేక్ చేయడం కోసం సెకండాఫ్ వరకు సినిమాను నడిపించి, మలి భాగమంతా ఈ పాయింట్ చుట్టూ అల్లేసి, క్లైమాక్స్ లో మామ-అల్లుడ్ని కలిపేస్తారట.