గన్‌ వచ్చేలోపు జగన్‌ వస్తాడు….

మహిళల భద్రతపై అసెంబ్లీలో చర్చ జరిగితే… టీడీపీ హయాంలో జరిగిన కాల్‌మనీ సెక్స్ రాకెట్, అమ్మాయి కనిపిస్తే ముద్దయినా పెట్టాలి… కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ వ్యాఖ్యలు, నారా లోకేష్ ఫొటోల అంశం ప్రస్తావనకు వస్తుందన్న భయంతోనే చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.

మహిళల భద్రతపై అసెంబ్లీలో మాట్లాడిన రోజా… ఆడవారి ప్రాణాల కంటే చంద్రబాబుకు ఉల్లిపాయలే ఎక్కువైపోయాయన్నారు. ఐదేళ్ల పాటు మహిళలను అవమానించినందుకే ప్రజలు చంద్రబాబును ఆ మూల కూర్చోబెట్టారన్నారు. లోకేష్ తినే పప్పులోకి వేసే ఉల్లిపాయ ధర పెరిగిందని చంద్రబాబు బాధపడుతున్నారే గానీ… ఆడపిల్లల భద్రత గురించి మాత్రం లెక్క చేయడం లేదన్నారు.

మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ ఆడదాని పుట్టుకనే ప్రశ్నించిన వ్యక్తి చంద్రబాబు అని రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు పాలనలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి విజయవాడలో 200 మంది మహిళల జీవితాలను కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ పేరుతో నాశనం చేశారన్నారు. ఇంతా చేసిన వీరు… ఇప్పుడు మహిళల భద్రతపై చర్చిస్తుంటుంటే అడ్డుపడడం బట్టి వీరంతా కడుపుకు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు.

ఆడపిల్లలపై దాడులు జరిగినప్పుడు తక్షణం శిక్షలు పడాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ఆడపిల్లలపై చేయి వేయాలంటే భయం ఉంటుందన్నారు. నిర్భయను ఢిల్లీలో దారుణంగా చంపేస్తే… ఇప్పటి వరకు వారిని శిక్షించలేని పరిస్థితి దేశంలో ఉందన్నారు.

దిశను దారుణంగా చంపినప్పుడు స్పందించని మానవహక్కుల కమిషన్‌… ఆమెను చంపిన హంతకులను ఎన్‌కౌంటర్ చేయగానే నిరసన తెలపడం సరికాదన్నారు.

రేప్‌ చేసిన వారిని ఉరి తీయడం ఏమిటి? రెండు బెత్తం దెబ్బలు కొట్టాలి… అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. మరి గతంలో ఇదే పవన్ కల్యాణ్ గన్‌ తీసుకుని రోడ్డు మీదకు ఎందుకొచ్చారని ప్రశ్నించారు. తన అక్కను వేధించిన వారిని చంపేయాలని బయలుదేరానని గతంలో చెప్పిన పవన్ కల్యాణ్… ఇప్పుడు మాత్రం అత్యాచారం చేసిన వారిని రెండు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయాలి అని ఎలా అంటారని రోజా నిలదీశారు.

నారాయణ కాలేజీల్లో అనేక మంది అమ్మాయిలు చనిపోతే కనీస చర్యలు తీసుకోలేని స్థితిలో చంద్రబాబు పాలన సాగిందన్నారు. ఆడపిల్లకు ముద్దయినా పెట్టాలి… కడుపైనా చేయాలి అని బాలకృష్ణ చెప్పినా చంద్రబాబు ఏనాడు స్పందించలేదన్నారు.

ఇకనైనా ఆడపిల్లల జోలికి రావాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చట్టం తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతున్నానని రోజా చెప్పారు. గన్‌ వచ్చేలోగా జగన్ వస్తారు… రక్షిస్తారన్న ధైర్యం ఆడపిల్లల్లో కనిపించేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుండడం హర్షించదగ్గ అంశమన్నారు.

టీడీపీ నేతల కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై నిలదీసినందుకు అసెంబ్లీ నుంచి ఏడాది పాటు తనను సస్పెండ్ చేయించిన వ్యక్తి చంద్రబాబు అని రోజా ఫైర్ అయ్యారు.

మగపిల్లలకు నైతిక విలువలు నేర్పాలి…. ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని తల్లిదండ్రులను రోజా కోరారు.