ఉదయ్‌ భాస్కర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు

ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్‌పై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. రాజ్యాంగబద్దమైన పోస్టు కావడంతో ప్రభుత్వం నేరుగా ఆయన్ను తొలగించడం అంత సులువు కాదు. దీన్ని అలుసుగా చేసుకుని ఉదయ్ భాస్కర్ ఇష్టానికి వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ఏరికోరి ఉదయ్ భాస్కర్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా తెచ్చుకున్నారు.

ఆయన హయాంలో అనేక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు నష్టం జరిగేలా అనేక నిర్ణయాలు ఆయన తీసుకున్నారు. పదేపదే సిలబస్ మార్చడం వంటివి చేశారు. ఉదయ్ భాస్కర్ నిర్ణయాల వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు బాగా నష్టపోయారన్న విమర్శ ఉంది.

ఇప్పటికే పలుమార్లు విద్యార్థి సంఘాలు ఉదయ్ భాస్కర్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేశాయి. ఇటీవల ఆరుగురు ఎమ్మెల్సీలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఉదయ్ భాస్కర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంలో ఉదయ్ భాస్కర్‌ను గవర్నర్‌ వివరణ కోరారు. కొద్ది రోజులుగా ఉదయ్ భాస్కర్ విధులకు కూడా సరిగా హాజరుకావడం లేదు. తన చాంబర్‌లోకి ఎవరూ వెళ్లకుండా తాళాలు వేసుకుని తీసుకెళ్తున్నారాయన.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు యూనివర్శిటీల్లో ఉదయ్ భాస్కర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అవి కూడా ఒకటి రెండు కాదు. వందలాది పోస్టర్లను వర్శిటీల్లో అతికించారు. ఉదయ్ భాస్కర్ హయాంలో ఏపీపీఎస్సీలో అంతులేని అవినీతి జరిగిందని.. ఆయన్ను తక్షణం తప్పించాలని కోరుతూ పోస్టర్లు వెలిశాయి.