వైసీపీలోకి గోకరాజు… రాజు విన్యాసాలకు చెక్?

ఏపీ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబం వైసీపీలో చేరేందుకు సిద్ధమైంది. సోమవారం గోకరాజు కుమారుడు, కుటుంబసభ్యులు సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం.

2014లో గోకరాజు గంగరాజు నరసాపురం నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలిచారు. గోకరాజు ఆర్‌ఎస్ఎస్‌తో పాటు అమిత్ షాకు చాలా సన్నిహితుడు. అలాంటి గోకరాజు కుటుంబం వైసీపీలో చేరేందుకు సిద్ధమవడం చర్చనీయాంశమైంది.

ఇటీవల ఎన్నికల్లో వైసీపీ తరపున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో రకరకాల విన్యాసాలు ఇటీవల చేస్తున్నారు. వైసీపీతో తనకు సంబంధం లేదు… తాను స్వతంత్రుడిని అన్నట్టుగా పలుపార్టీల పెద్దలను నేరుగా కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో గోకరాజు కుటుంబం వైసీపీలో చేరడం చర్చనీయాంశమైంది.

రఘురామకృష్ణంరాజుకు అదే వర్గానికి చెందిన గోకరాజుతో చెక్ పెట్టే వ్యూహం ఇందులో దాగి ఉందా… అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు బీజేపీ నేతలు… టీడీపీ, వైసీపీ నేతలు తమకు టచ్‌లో ఉన్నారంటూ చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడికే సన్నిహితుడైన గోకరాజు వైసీపీ వైపు వెళ్తుండడం ఆసక్తిగా ఉంది.