రేపు సిట్ విచారణకు ఆది…. వెంటాడుతున్న అరెస్టు భయం !

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు విచారణకు దూరంగా ఉన్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి… రేపు సిట్‌ ముందుకు రాబోతున్నారు.

సిట్‌ విచారణకు రావాలని ఇప్పటికే మూడుసార్లు ఆదినారాయణరెడ్డిని పిలిచారు. నోటీసులు ఇచ్చారు. మరో మూడు సార్లు ఫోన్ల ద్వారా సమాచారం అందించారు. అయితే ఆయన మాత్రం విచారణకు రాలేదు.

సీఆర్‌పీఎస్‌ సెక్షన్‌ 41 కింద విచారణకు పిలిచారని…. ఆ సెక్షన్‌ కింద సిట్‌ విచారణకు వెళితే అరెస్టు చేసే అవకాశం ఉందని ఆదినారాయణరెడ్డి భయపడుతున్నారట. దీంతో సిట్‌ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు రాలేదట. 41 సెక్షన్‌ కింద వెళితే అరెస్టు అయ్యే అవకాశం ఉందని తెగ మథనపడుతున్నారట.

అయితే తాజాగా సిట్‌ సీఆర్‌పీఎస్‌ 160 కింద నోటీసులు జారీ చేసింది. దీంతో ఆదినారాయణరెడ్డి రేపు విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నాడట. ఈ సెక్షన్‌ కింద అరెస్టు చేసే అవకాశం లేకపోవడంతో సిట్‌ ముందుకు రేపు ఆది నారాయణరెడ్డి వస్తారని ప్రచారం జరుగుతోంది.

వివేకా హత్య కేసులో ఇప్పటివరకూ మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, పరమేశ్వర్‌రెడ్డితో పాటు వివేకా బంధువులు, సోదరులను విచారించారు. వారం రోజుల్లో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుందని తెలుస్తోంది.