అచ్చెన్నాయుడు బ్యాక్‌ సీట్‌ ఫోజులపై అంబటి అభ్యంతరం

అసెంబ్లీలో అచ్చెన్నాయుడు వ్యవహార శైలి హుందాగా లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ బెంచీలకు పక్కనే కూర్చునే అంబటి రాంబాబు… అచ్చెన్నాయుడు చేస్తున్న పనుల వల్ల తాము ఇబ్బంది పడుతున్నామంటూ కొన్ని ఫోటోలను సభలో ప్రదర్శించారు.

తమ వైపు బ్యాక్ సీట్ పదేపదే చూపిస్తూ అచ్చెన్నాయుడు ఇబ్బంది పెడుతున్నారని… పదేపదే ఒంగి ఒంగి ఫోజులు పెడుతున్నారని అంబటి రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు.

మాట వినకపోతే తనను కూడా జగన్‌ జైలుకు తీసుకెళ్తాడేమోనన్న భయంతోనే జగన్‌ పాలనలో వర్షాలు పడుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై అంబటి స్పందించారు.

విచారణలో ఉన్న కేసులోనే జగన్‌ దోషి అయితే… ప్రస్తుతం చంద్రబాబుపైన కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోందని… మరి చంద్రబాబు కూడా దోషి అయిపోతారా? అని ప్రశ్నించారు.

70 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రాడి తరహాలో ఆలోచిస్తానని చంద్రబాబు చెబుతున్నారని… ఆయన కుమారుడు లోకేష్‌ మాత్రం 70 ఏళ్ల వృద్ధుడి తరహాలో మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.