సీఎం రిలీఫ్‌ ఫండ్ విషయంలోనూ వివక్ష చూపిన వ్యక్తి చంద్రబాబు

అధికార, ప్రతిపక్షాల మధ్య మంచి వాతావరణాన్ని దెబ్బతీసే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబే అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.

అచెన్నాయుడు రోజుకు ఒక్కసారైన ”నాలెడ్జ్ తెచ్చుకోండి… నా సూచనలు వినండి” అంటున్నారని… ఆ సూచనలు, ఆ నాలెడ్జ్‌ను ఐదేళ్ల పాటు చూశామన్నారు. సభ ప్రారంభంలో చేయి ఎత్తి అవకాశం ఇవ్వాలని వంశీ కోరారని… ఏంటో తెలుసుకునేందుకు స్పీకర్ అవకాశం ఇస్తే వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడం ఏమిటి అని ప్రశ్నించారు. వంశీ ఇంకా ఏమీ మాట్లాడకముందే…. వంశీ టీడీపీని తిట్టబోతున్నారు అంటూ ఊహించుకోవడం ఏమిటని నిలదీశారు.

వంశీ మాట్లాడుతుంటే చంద్రబాబు ఎందుకు బయటకు వెళ్లారో…. తర్వాత ఎందుకు లోపలికి వచ్చారో… ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. వంశీ మాట్లాడిన ఐదు నిమిషాల్లో ఏం తప్పు మాట్లాడారని టీడీపీ సభ్యులను బుగ్గన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంటే ఎమ్మెల్యేందరికీ సమానమేనన్నారు. గతంలో సీఎంల వద్దకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా వెళ్లేవారన్నారు. కానీ ఈ సాంప్రదాయానికి చరమగీతం పాడింది 2014 నుంచి చంద్రబాబేనన్నారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజక వర్గాల్లో టీడీపీ నేతలను ఇన్‌చార్జ్‌గా పెట్టి వారికి నిధులు అందించిన వ్యక్తి చంద్రబాబు అని బుగ్గన విమర్శించారు. అలా చేయకుండా ప్రతిపక్ష వైసీపీ సభ్యులకు కూడా నియోజకవర్గ నిధులు ఇవ్వాలని 46 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లి చంద్రబాబును కలిస్తే… నేరుగా ”నేను ఇవ్వను ”అని ఇదే చంద్రబాబు వ్యాఖ్యానించింది నిజం కాదా అని ప్రశ్నించారు.

నియోజకవర్గ అభివృద్ధి నిధులే కాకుండా చివరకు సీఎం రిలీఫ్‌ ఫండ్ విషయంలో కూడా నాటి ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేల పట్ల చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరించారని బుగ్గన విమర్శించారు.

జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయ్యాక నియోజకవర్గ అభివృద్ధి నిధులను టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఇస్తున్నారని బుగ్గన వివరించారు. అలాంటి తమ ప్రభుత్వం చంద్రబాబునాయుడిని చూసి నేర్చుకోవాలా అని బుగ్గన ప్రశ్నించారు.