ఈ పాటను ఎవరూ పట్టించుకోరేంటి?

సంక్రాంతి బరిలో నిలిచిన మహేష్, బన్నీ సినిమాలు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కానీ ఈ సినిమాలతో పాటు అదే టైమ్ లో విడుదలకు సిద్ధమైన ఎంతమంచివాడవురా సినిమాను మాత్రం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. మహేష్, బన్నీకి ఉన్న స్టార్ డమ్, వాళ్ల సినిమాలకు చేస్తున్న ప్రచారం ముందు కల్యాణ్ రామ్ మూవీ నిలవడం లేదు.

నిన్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. నిజంగానే పాట చాలా బాగుంది. గోపీసుందర్ సంగీతం అందించగా, ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. కానీ ఈ సింగిల్ ను పట్టించుకున్న నాథుడు లేడు. ఓవైపు సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి పాట రిలీజ్ అవ్వడం, మరోవైపు అల వైకుంఠపురములో సినిమా టీజర్ కు సంబంధించి గ్లింప్స్ రావడంతో.. ఎంత మంచివాడవురా సింగిల్ లైమ్ లైట్లో లేకుండా పోయింది.

ఈ విషయం కల్యాణ్ రామ్ వరకు వెళ్లింది. తన సినిమాల ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోని కల్యాణ్ రామ్, దీనిపై ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు రెండు పీఆర్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఒకరు చేస్తారంటే, మరొకరు చేస్తారంటూ రెండు పీఆర్ టీమ్స్ లైట్ తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చినట్టు కల్యాణ్ రామ్ గుర్తించాడు. త్వరలోనే తన సినిమా ప్రచారానికి సంబంధించి యూనిట్ తో ఓ కీలక సమావేశం ఏర్పాటుచేయబోతున్నాడు ఈ హీరో.