రేపైనా సినిమా రిలీజ్ అవుతుందా?

రామ్ గోపాల్ వర్మ తీసిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకు పేరు మార్చిన సంగతి తెలిసిందే. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా పేరు మార్చి సెన్సార్ కు పంపించారు. సెన్సార్ అధికారులు చేతులు ఎత్తేశారు. తర్వాత రివ్యూ కమిటీకి వెళ్లింది. కొన్ని కట్స్ తో అక్కడ సెన్సార్ దొరికేసింది. దీంతో సినిమా విడుదలకు అంతా లైన్ క్లియర్ అనుకున్నారు.

కానీ రేపు కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అవ్వదా? అనే సందిగ్దం అందర్లో ఉంది. ఎందుకంటే, ఈ సినిమాను అంత తేలిగ్గా వదలదలుచుకోలేదు కేఏ పాల్. తన క్యారెక్టర్ ను కించపరిచారని, సినిమా విడుదలను ఆపేయాలని మరోసారి ఆయన హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. అదే కనుక జరిగితే సినిమా విడుదల రేపు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది.

ఈసారి కొత్త పల్లవి అందుకున్నారు కేఏ పాల్. తన ఫొటోలు, తనపై తీసిన వీడియోల్ని సోషల్ మీడియా నుంచి కూడా డిలీట్ చేసిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని పాల్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, సినిమాలో తన ప్రస్తావన లేకుండా చేయాలని, తన పేరు ఉపయోగించకూడదని కండిషన్ పెడుతున్నారు.

మూవీలో అన్ని పేర్లు మార్చేశాడు వర్మ. కానీ ఎందుకో కేఏ పాల్ పేరును మాత్రం అలానే ఉంచాడు. హైకోర్టు ఆదేశిస్తే, ఆ పేరును మ్యూట్ చేసి సినిమా రిలీజ్ చేస్తాడు.