పవన్‌కు షాక్‌… జగన్‌ నిర్ణయానికి జనసేన ఎమ్మెల్యే సమర్థన

ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా చదివే వారు పేదల పిల్లలే ఉంటున్నారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలంటూ జగన్‌మోహన్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని… దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు.

చంద్రబాబు కూడా గతంలో ఇదే తరహాలో ఆలోచన చేశారని… ఇప్పుడు దాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆచరణలోకి తెస్తుంటే దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని జనసేన ఎమ్మెల్యే ప్రశ్నించారు.

తమ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు చాలా మంది వెళ్తుంటారని… అక్కడ వారు కేవలం కూలి పని మాత్రమే చేయగలుగుతున్నారని…. అదే కేరళ నుంచి వెళ్లిన వారు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవడం వల్ల గల్ఫ్ లో అధికారులుగా ఉంటున్నారని రాపాక వివరించారు.

ఏ పార్టీకి చెందిన వారైనా సరే స్పీకర్ స్థానాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. వయసులో పెద్దవారైన చంద్రబాబు సంయమనంతో సభలో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు.