గోకరాజు ద్వారా నాకు చెక్ పెట్టలేరు

జగన్ మోహన్ రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బందీ, వివాదం లేదన్నారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. వైసీపీలో కొందరు ఎంపీలతో విభేదాలు ఉన్న మాట మాత్రం వాస్తవం అన్నారు. తాను పార్టీ నుంచి వెళ్లి పోతే బాగుంటుంది అని కోరుకునే వారే జగన్ కు లేనిపోనివి చెబుతూ ఉండవచ్చు అన్నారు. అలాంటి వారు పార్టీలో ఇద్దరు ముగ్గురు ఉన్నారన్నారు.

జగన్ చుట్టూ ఉన్న వారు కూడా తాను వెళ్లిపోతే మంచిది అని భావిస్తూ ఉండవచ్చన్నారు. కానీ జగన్ తో మంచి సంబంధాలు ఉన్నందున తాను పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు.

తాను ఇచ్చే విందులో ఒక్కొక్కటి వెయ్యి రూపాయల విలువ చేసే పాన్ ను విమానంలో విదేశాల నుంచి తెప్పిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. విందుకు పార్టీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని… ఆ అవసరం కూడా లేదన్నారు. విందుల పై పార్టీ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదన్నారు. వైసీపీ ఎంపీలను కూడా విందుకు ఆహ్వానించినట్లు చెప్పారు.

గతంలో సుబ్బరామి రెడ్డి, సీఎం రమేష్ లు ఇలాగే ఎంపీలకు విందు ఇచ్చే వారని… తాను కూడా అది చూసి విందు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

గోకరాజు కుటుంబం ద్వారా తనకు చెక్ పెట్టాలనుకుంటే అది తప్పుడు నిర్ణయం అవుతుందన్నారు. బీజేపీలో తనకు దక్కాల్సిన ఎంపీ సీటును గోకరాజు రాబందులా తన్నుకుపోయాడు అని విమర్శించారు.