ఇలాగైతే మేం అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు

మీడియాను నియంత్రించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదేపదే ఇంగ్లీష్ రాదంటూ తమను హేళన చేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగిన పని కాదన్నారు. దేశంలో ఉన్న అన్ని మీడియా సంస్థలు ఈ జీవోను ఖండిస్తున్నాయని… మరి వారికి కూడా ఇంగ్లీష్‌ రాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్‌ హయాంలోనూ ఇలాంటి జీవో తెచ్చారని… దానిపై గొడవ చేస్తే తెల్లారే సరికి వైఎస్ వెనక్కు తగ్గారన్నారు.

ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి మాత్రం మీడియాను తన కంట్రోల్‌లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. కొన్ని పత్రికలను కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి జీవోలు తేవడం సరికాదన్నారు. అసెంబ్లీకి తాను వస్తుంటే చీఫ్ మార్షల్‌ చేతులతో వెనక్కు తోసేశారని ఇదేం పద్దతి అని చంద్రబాబు ప్రశ్నించారు. నల్ల బాడ్జీలు కూడా అసెంబ్లీలో పెట్టుకోవడానికి వీల్లేదనడం ఎంతవరకు సమంజసమన్నారు.

ఇదే జగన్‌మోహన్ రెడ్డి గతంలో ప్రత్యేక హోదా కోసం నల్ల బాడ్జీలు, నల్ల చొక్కలు వేసుకుని అసెంబ్లీకి వచ్చారని ఆ రోజు తాము అడ్డుకోలేదన్నారు. గతంలో ఎన్టీఆర్‌పైనా దాడి చేసేందుకు వైఎస్‌ ప్రయత్నించారని, ఒక సందర్భంలో ఎన్టీఆర్‌ ఇంటి వద్ద వైఎస్‌ ధర్నా చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా అసెంబ్లీలో పులివెందుల పంచాయతీలు చేస్తే ఊరుకోబోమన్నారు. తమపై దాడి చేసిన మార్షల్స్‌ పై చర్యలు తీసుకోకుంటే తాము అసెంబ్లీకి కూడా రావాల్సిన అవసరం లేదన్నారు.