జైలర్‌ కాలితో ఎగిరి తన్నారు అధ్యక్షా !…. నాపై చంద్రబాబు చేసిన దుర్మార్గం ఆ వెంకటేశ్వరస్వామికే తెలుసు….

అసెంబ్లీలోకి వస్తుంటే మార్షల్స్ అడ్డుకున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేయడంపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తనకు జరిగిన అవమానాలను వివరించారు.

గతంలో ఒక వైసీపీ కార్యకర్త ఇంటిని అధికారులు కూల్చేస్తే… దానిపై ధర్నా చేసినందుకు అధికారులను కులం పేరుతో దూషించానని తప్పుడు కేసు పెట్టి కడప సెంట్రల్‌ జైలుకు తరలించారని చెవిరెడ్డి గుర్తు చేశారు. ఉదయం నిద్రలేవగానే జైలులో ఆరుబయట తాను కూర్చొని ఉండగా జైలర్ నేరుగా వచ్చి ఇక్కడ కూర్చున్నావేంట్రా ల… కొడకా అంటూ ఎగిరి కాలితో తన్నారని చెవిరెడ్డి చెప్పారు.

ఎమ్మెల్యే అయిన తనను జైలర్ కాలితో తంతే తట్టుకోలేక రెండు రోజులు అన్నం మానేసి జైలులోనే దీక్ష చేశానని.. చివరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి వదిలేయ్ అంటే అప్పుడు దీక్ష విరమించానని చెవిరెడ్డి వెల్లడించారు.

మరో సారి ఇంకో కేసు పెట్టి రాత్రంతా బస్సులో కింద పడేసి తమిళనాడు మొత్తం తిప్పారని చెవిరెడ్డి ఆవేదన చెందారు. చంద్రబాబు దుర్మార్గానికి తాను ఎన్ని ఇబ్బందులు పడ్డానో ఆ వెంకటేశ్వరస్వామికే తెలుసని చెవిరెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు తాను చస్తానో… బతుకుతానో తెలియకుండా బతికానని వివరించారు. అరెస్ట్ చేసిన సమయంలో తనను ఒక ఎమ్మెల్యేగా చూడకుండా ఒక ఉగ్రవాది తరహాలో కొట్టారని చెవిరెడ్డి చెప్పారు. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెకు తాను ఎమ్మెల్యే కావడాన్ని జీర్ణించుకోలేక తనపై చంద్రబాబు చేయని దుర్మార్గం లేదన్నారు.

తాను డాక్టరేట్ పూర్తి చేసిన విద్యావంతుడినని…. అలాంటి తనను చివరకు ఇదే అసెంబ్లీ ప్రాంగణంలో నల్ల బాడ్జీ పెట్టుకుని తిరుగుతుంటే తీసుకెళ్లి రెండు రోజుల పాటు మంగళగిరి స్టేషన్‌లో ఉంచారని గుర్తు చేశారు.

ఎన్నికల వరకు బతికుంటే ఆ తర్వాత బతికినట్టే… అప్పటి వరకు జాగ్రత్తగా ఉండూ…. అని తమ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి కూడా చెప్పారని చెవిరెడ్డి వివరించారు. ఇంతటి దుర్మార్గాలు చేసిన చంద్రబాబు… ఇప్పుడు వచ్చి మార్షల్స్‌ తోశారంటూ రాద్దాంతం చేయడం ఏమిటని నిలదీశారు.