ఎన్‌కౌంటర్‌ వెనుక నిజాలు బయటకు రావాలి – సుప్రీం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టులో రెండో రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. నిందితులు పోలీసుల పైకి కాల్పులు జరిపారా? అని ప్రశ్నించగా ప్రభుత్వ తరపున న్యాయవాది అవును అని చెప్పారు.

నిందితులు తుపాకులు లాక్కుని కాల్పులు జరిపారని… ఆత్మరక్షణ కోసం పోలీసులు తిరిగి కాల్పులు జరపగా నిందితులు చనిపోయారని తెలంగాణ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వివరించారు.

ఇందుకు స్పందించిన సుప్రీం కోర్టు మరి నిందితులు కాల్పులు జరిపితే పోలీసులకు గాయాలు కాలేదా?, నిందితులు ఫైర్ చేసిన బుల్లెట్లు ఎక్కడున్నాయి? అని ప్రశ్నించింది. ఇందుకు ప్రభుత్వ లాయర్ నిందితులు పేల్చిన తూటాలు దొరకలేదని వివరణ ఇచ్చారు.

ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. పిటిషన్ వేసిన లాయర్ మణిపైనా సుప్రీం కోర్టు కొన్ని ప్రశ్నలు సంధించింది. వెటర్నరీ డాక్టర్‌కు మానవహక్కులు వర్తించవా? అని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది.

ఉద్దేశపూర్వకంగానే ఎన్‌కౌంటర్ చేసినట్టుగా ఉందని పిటిషనర్‌ వాదించగా… ఘటనా స్థలిలో ఏం జరిగిందో? ఎవరికీ తెలియదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కోర్టు భావిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకు వివరించారు.

ఈ వ్యవహారంలో నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.