అన్న కోసం త‌మ్ముడు త్యాగం చేశారా?

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. బీజేపీలో చేర‌తార‌ని ఈయ‌న‌పై ప్ర‌చారం జ‌రిగింది. ఆయ‌న కూడా హైద‌రాబాద్ టు ఢిల్లీ తిరుగుతూ హ‌డావుడి చేశారు. కాంగ్రెస్ నేత‌ల‌పై సెటైర్లు వేశారు. తాను పార్టీ మార‌డం ఖాయ‌మ‌ని సిగ్న‌ల్స్ పంపారు. కానీ కొన్నాళ్లుగా ఇప్పుడు సైలెంట్ అయ్యారు.

ఇటీవ‌ల కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశాల‌కు రాజ‌గోపాల్‌రెడ్డి హాజ‌ర‌వుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్ నేత‌ల‌తో పాత రిలేష‌న్స్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. రాజ‌గోపాల్‌రెడ్డిలో ఈ మార్పు ఎందుకు వ‌చ్చింది? అని ఆరా తీస్తే అనుచ‌రుల‌కు అస‌లు విష‌యం తెలిసింద‌ట‌.

రాజ‌గోపాల్ రెడ్డి అన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప్ర‌స్తుతం భువ‌నగిరి ఎంపీ…. వెంక‌ట‌రెడ్డి పీసీసీ రేసులో ఉన్నారు. ఆయ‌న‌కు ఓ చాన్స్ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అన్న పీసీసీ అధ్య‌క్షుడు అయితే తాను వేరొక పార్టీలో ఉండ‌డం క‌రెక్ట్ కాద‌ని రాజ‌గోపాల్‌రెడ్డి అనుకున్నార‌ట‌. అందుకే పార్టీ మారే నిర్ణ‌యం వెన‌క్కి తీసుకున్నార‌ట‌.

కోమ‌టిరెడ్డి కుటుంబానికి పీసీసీ ప‌ద‌వి వ‌స్తే రాజ‌కీయాల్లో మ‌ళ్లీ యాక్టివ్ కావొచ్చ‌నేది రాజగోపాల్ రెడ్డి నిర్ణ‌యంగా తెలుస్తోంది. న‌ల్గొండ జిల్లాలో త‌మ ఆధిప‌త్యం తిరిగి చెలాయించవ‌చ్చ‌ని చూస్తున్నారు.

ఇటు బీజేపీలో కూడా రాజ‌గోపాల్‌రెడ్డికి దారులు మూసుకుపోయిన‌ట్లు తెలుస్తోంది. ఒక్క ఎమ్మెల్యే వ‌స్తే త‌మ‌కు ఉపయోగం లేద‌ని బీజేపీ నేత‌లు తేల్చిచెప్పిన‌ట్లు స‌మాచారం.

మొత్తానికి క‌మ‌లం పార్టీ విషయంలో క్లారిటీ రావ‌డంతోనే…. రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే కొన‌సాగాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.