సీమలో హైకోర్టుపై ఏపీ ప్రభుత్వ సమాధానం

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై ఏపీ ప్రభుత్వం స్పందించింది. టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం శాసన మండలిలో సమాధానం ఇచ్చింది. కర్నూలులో హైకోర్టుగానీ, హైకోర్టు బెంచ్‌గానీ ఏర్పాటు చేసే ఆలోచన ఉందా అని కేఈ ప్రభాకర్ ప్రశ్నించారు.

ఇందుకు సమాధానం ఇచ్చిన ప్రభుత్వం నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే కర్నూలులో హైకోర్టు గానీ, హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై గానీ నిర్ణయం ఉంటుందని వెల్లడించింది. నిపుణుల కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోందని వివరించింది.

చాలా కాలంగా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీమ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేఈ ప్రభాకర్ అడిగిన ప్రశ్న ద్వారా ప్రభుత్వం స్పందించింది. నిపుణుల కమిటీ వచ్చాకే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.